Feb 04,2021 00:17

టూ వీలర్‌కు తాడు కట్టి నిరసన వ్యక్తంచేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - తాడేపల్లి : బడ్జెట్‌లో రాజధానికి నిధులు కేటాయించకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్యాయం చేసిందని సిపిఎం రాజధాని డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఎం.రవి ఆగ్రహం వ్యక్తంచేశారు. అడ్డగోలుగా పెంచిన డీజిల్‌, పెట్రోలు ధరలు తగ్గించాలని నిరసన వ్యక్తంచేస్తూ బుధవారం ఉండవల్లి సెంటర్‌లో టూ వీలర్‌కు తాళ్ళు కట్టి లాగి తమ నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ కేంద్ర ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కార్పొరేట్‌ బడ్జెట్‌ అని విమర్శించారు. బడ్జెట్‌లో ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయిందని దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణానికి రూపాయి కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కె.సుందరయ్య మాట్లాడుతూ యువతకు నిధులు కేటాయించకుండా అన్యాయం చేసిన బడ్జెట్‌ను యువతరం వ్యతిరేకించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఈ.రామారావు, వి.వెంకటేశ్వరరావు, ఎ.భాస్కరయ్య, పి.రాఘవులు, వి.మస్తాన్‌రావు, ఎస్‌.రామకృష్ణ, పి.శివయ్య, సైకం వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు.