అమరావతి బ్యూరో : రాష్ట్రాల హక్కులను దెబ్బతీసే క్రూరమైన ప్రతిపాదనలు కేంద్ర బడ్జెట్లో ఉన్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. 'కేంద్ర బడ్జెట్ - ప్రజలు, ఫెడరల్ వ్యవస్థపై దాడి' అనే అంశంపై సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన బుధవారం సాయంత్రం జరిగిన ఆన్‌లైన్ సెమినార్లో రాఘవులు మాట్లాడారు. ఇది సామాన్య ప్రజల కష్టాల బడ్జెట్‌లా ఉందని, ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేసే బడ్జెట్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు వైసిపి, టిడిపి నాయకులు భయపడుతున్నారని, పోటీపడి బిజెపిని బలపరుస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో వైసిపి అవకాశవాదాన్ని వదులుకోవాలని, అనుభవం ఉందని చెప్పుకుంటున్న తెలుగుదేశం నాయకులు రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకుండా బిజెపికి భజన చేస్తున్నారని అన్నారు. ప్రశ్నిస్తేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని, రెండు పార్టీలూ కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు. ఉపాధిపోయిన ప్రజలను ఆదుకునే ఒక్క చర్య కూడా లేదన్నారు.
బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టిన వారికే ఆ బ్యాంకులు అప్పగించే చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఆరోగ్యానికి 137 శాతం పెంచామని చెబుతున్నా ఆచరణలో తగ్గిందన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, ఉపాధి హామీ, విద్యావ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానానికి పెట్టే ఖర్చులు తగ్గాయని అన్నారు. కార్పొరేట్ పన్నులు గతేడాది 6.8 శాతం ఉంటే ఈ ఏడాది 5.4 శాతానికి తగ్గించారని అన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని, ఎల్‌ఐసి లాంటి సంస్థల్లో 74 శాతం విదేశీ పెట్టుబడులు అనుమతిస్తున్నాని, ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఉపాధి హామీకి ఈ బడ్జెట్లో రూ.73 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, గతేడాది సుమారు లక్షకోట్లకుపైగా కేటాయించారన్నారు. ఫుడ్ సబ్సిడీ, ఎస్‌సి, ఎస్‌టి, మహిళా బడ్జెట్ తగ్గించారని తెలిపారు. పోలవరం, విభజన చట్టం, ప్రత్యేక హోదా, కడపస్టీల్‌ప్లాంటు, వెనుకబడిన జిల్లాలకు, సెంట్రల్ యూనివర్శిటీలకు నిధుల కేటాయింపు లేదన్నారు. రాష్ట్రానికి కేంద్ర వాటాల తగ్గిపోనుందని, రానున్న ఐదేళ్లలో 11 వేల కోట్ల రూపాయలు నష్టమని తెలిపారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా సిపిఎం ఆందోళనలు చేపడుతుందని అన్నారు. రాష్ట్రాలకు వాటాలు ఎగ్గొట్టేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని పేర్కొన్నారు. కేంద్రం చర్యలపై ప్రజా కార్యాచరణ అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.










