ప్రజాశక్తి-గుంటూరు : కేంద్ర బడ్జెట్ దేశ స్వావలంబనను దెబ్బతీస్తుందని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. బడ్జెట్ ప్రజల కోసం కొనుగోలు శక్తి పెంచేదిగా లేదని, కార్పొరేట్లకు అనుకూలంగా ఉందని తెలిపారు. గురువారం అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో అర్థశాస్త్ర ఉపన్యాసకులు సి.సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బడ్జెట్ విశ్లేషణలో లక్ష్మణరావు మాట్లాడారు. బీమా రంగంలో 79శాతం ఎఫ్‌డిఐలను అనుమతించటం, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.1.75 లక్షల కోట్లు పెట్టుబడులు ఉపసంహరించటం అత్యంత ప్రమాదకరమన్నారు. విద్యారంగానికి రూ.99 వేల కోట్ల నుంచి రూ.93వేల కోట్లకు నిధులు కుదించారని చెప్పారు. ఎపికి విభజన హామీలు అమలు చేయటంలో మరోసారి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రొఫెసర్ సిఎస్‌ఎన్.రాజు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించటం సరికాదని, ఆరోగ్య రంగానికి రూ.2.24లక్షల కోట్లు కేటాయించటం హర్షణీయ మన్నారు. ఆర్థిక వేత్త డాక్టర్ ఎ.రాజశేఖర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి తగినంతగా నిధులు కేటాయిం చలేదన్నారు. కార్యక్రమంలో మేధావుల ఫోరం కన్వీనర్ పిఎస్ మూర్తి, న్యాయవాది ఎ.హరి పాల్గొన్నారు.










