ఐరాస : మహిళల హక్కులను నిరాకరిస్తూ వారి ఉపాధిని అడ్డుకుంటున్న తాలిబన్ ప్రభుత్వంపై విచారణ చేపట్టాలని ఐరాస కోరింది. ఆఫ్ఘనిస్తాన్‌లో బాలికలు మరియు మహిళలకు విద్య, ఉపాధిపై నిరంకుశంగా నిషేధం విధించడంతో పాటు మానవత్వానికి వ్యతిరేకంగా తాలిబన్ నేతలు నేరాలకు పాల్పడుతున్నారని, ఆ ప్రభుత్వంపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ఐసిసి)లో విచారణ చేపట్టాలని ఐరాసలోని ప్రపంచ విద్య ప్రత్యేక రాయబారి గోర్డాన్ బ్రౌన్ ప్రతినిధి కోరారు. తాలిబన్ అధికారం చేపట్టి ఆగస్ట్ 15తో రెండేళ్లు పూర్తికానుండటంతో ఐరాసలోని ప్రపంచ విద్య ప్రత్యేక రాయబారి గోర్డాన్ బ్రౌన్ వర్చువల్‌గా మాట్లాడారు. ప్రపంచంలో మహిళల మరియు బాలికల హక్కుల ఉల్లంఘన అత్యంత ఘోరమైన, సమర్థించలేని చర్యగా ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు పాలకులే బాధ్యత వహించాల్సి వుంటుందని స్పష్టం చేశారు. విద్య మరియు ఉపాధిని తిరస్కరించడం లింగ వివక్ష అని, ఇది మానవాళికి వ్యతిరేకంగా జరిగిన నేరంగా పరిగణించబడుతుందని పేర్కొంటూ తన అభిప్రాయాన్ని ఐసిసి ప్రాసిక్యూటర్ కరీంఖాన్‌కు పంపినట్లు తెలిపారు. దీనిపై ఐసిసి విచారణ చేపట్టాలని అన్నారు.
తాలిబన్ అగ్ర నేత హిబతుల్లా అఖుంద్జాబా నివసిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ దక్షిణ నగరమైన కాందహార్‌కు ప్రతినిధుల బృందాన్ని పంపాలని బ్రౌన్ ముస్లిందేశాలను అభ్యర్థించారు. మహిళల విద్య, ఉపాధిపై నిషేధం విధించాలని ఖురాన్ లేదా ఇస్లామిక్ మతంలో ఉన్నట్లు ఆధారం లేదని, నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాల్సిందిగా ఆదేశించాలని, లేకుంటే ఐసిసిలో కేసు వేయాల్సిందిగా సూచించారు. పాలనలో చీలిక ఉందని తాను నమ్ముతున్నానని అన్నారు. విద్యా మంత్రిత్వ శాఖతో పాటు రాజధాని కాబూల్‌లో కొంత మంది బాలికల విద్యాహక్కుని పునరుద్ధరించబడాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కాందహార్‌లోని మత పెద్దలు ఆంక్షలకు విరుద్ధంగా ఉన్నారని, సూచనలను జారీ చేస్తున్నారని తాను విశ్వసిస్తున్నాని అన్నారు. మహిళల, బాలికల విద్య హక్కును పునరుద్ధరిస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌కు నిలిపివేసిన విద్య సాయాన్ని పునరుద్ధరించబడుతుందని తాలిబన్ ప్రభుత్వానికి తెలియజేయాలని అన్నారు.
తాలిబన్ ప్రభుత్వం జారీ చేసిన 84 ఉత్తర్వులలో 54 ఉత్తర్వులు మహిళల, బాలికల హక్కులను లక్ష్యంగా చేసుకున్నారని, వాటిని విచ్ఛిన్నం చేస్తున్నాయని అన్నారు. ఇటీవల యూనివర్శిటీ పరీక్షలపై నిషేధం విధించడంతో పాటు బహిరంగ ప్రదేశాల సందర్శనను కూడా నిలిపివేశారని బ్రౌన్ చెప్పారు. విద్యాహక్కుని పునరుద్ధరించేందుకు గత రెండేళ్లుగా కృషి చేస్తున్నామని అన్నారు. మరో ఏడాది ఇలాగే గడిచి పోవడం తనకు ఇష్టం లేదని చెప్పారు. తాలిబన్‌లు అధికారంలో లేని 20 ఏళ్లలో ఆరు మిలియన్ల మంది బాలికలు చదువుకున్నారని, వైద్యులు, న్యాయవాదులు, లాయర్లు, పార్లమెంటు సభ్యులు, క్యాబినెట్ మంత్రులుగా కూడా బాధ్యతలు చేపట్టారని బ్రౌన్ వెల్లడించారు. 20 ఏళ్ల సుదీర్ఘ యుద్ధం తర్వాత అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుండి మహిళలపై పలు ఆంక్షలు విధిస్తున్నారు.