మైనారిటీల హక్కుల పరిరక్షణకు రెట్టింపు కృషి చేయాలి
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్ పిలుపు
న్యూఢిల్లీ : భారతదేశంలో మానవ హక్కుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్ వోల్కర్ తుర్క్ అన్నారు. సోమవారం ప్రారంభమైన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి 54వ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం రెట్టింపు కృషి జరపాలని కోరారు. భారత్‌లో వెనుకబాటుకు గురవుతున్న మైనారిటీ కమ్యూనిటీలు హింస, వేధింపులు, వివక్షకు గురవుతున్నట్లు తమ కార్యాలయానికి సమాచారం అందుతోందని చెప్పారు. చాలా సందర్బాల్లో ఇటువంటి దాడులకు గురయ్యేది ముస్లిములేనని తెలిపారు. ఇటీవల ఉత్తర భారతంలో ముఖ్యంగా హర్యానా, గుర్‌గావ్‌ల్లో జరిగిన దాడుల గురించి ఆయన ప్రస్తావించారు. గత నెలలో హర్యానావ్యాప్తంగా చెలరేగిన హింస, ఘర్షణలు దాదాపు వారంపాటు సాగాయి. ఏడుగురు చనిపోగా, 200మందికి పైగా గాయపడ్డారు. గత నాలుగు మాసాలుగా జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇతర కమ్యూనిటీలు కూడా హింసను, అభద్రతను ఎదుర్కొంటున్నాయని అన్నారు. నివేదికల ప్రకారం చూసినట్లైతే 200మందికి పైగా మరణించగా, 70వేల మందికి పైగా నిర్వాసితులయ్యారని తెలిపారు. అసహనం, విద్వేష ప్రసంగాలు, మతపరమైన మతోన్మాదం, వివక్ష వంటి పరిస్థితులను మరింత సూటిగా, స్పష్టమైన రీతిలో భారత ప్రభుత్వం ఎదుర్కొనాలని చెప్పారు. మైనారిటీలందరి హక్కుల పరిరక్షణ కోసం కృషిని రెట్టింపు చేయాలని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లో పెనాల్టీలను పెంచేందుకు దైవ దూషణ చట్టాలను సవరించే ఆలోచనను అక్కడి ప్రభుత్వం చేస్తోందన్నారు. ఫైసలాబాద్‌లో పెద్ద సంఖ్యలో అల్లరిమూక డజన్ల సంఖ్యలో చర్చిలను ధ్వంసం చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో మానవ హక్కుల పరిస్థితిపై కూడా తుర్క్ ఆందోళన వ్యక్తం చేశారు.