ఐరాస : పేర్ల మార్పుకు సంబంధించి దేశాల నుండి అభ్యర్థనలు వస్తే.. ఐరాస వాటిని స్వీకరించి పరిగణనలోకి తీసుకుంటుందని ఉన్నతాధికారి ఒకరు గురువారం తెలిపారు. 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' పేరిట రాష్ట్రపతి నుండి ఆహ్వానాలు రావడంతో దేశం పేరు మార్పుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీంతో ఇండియా పేరు మార్పుకు సంబంధించిన ప్రశ్నపై ఐరాస స్పందించింది.
ఉదాహరణకు గతేడాది టర్కీ తన దేశం పేరును తుర్కియేగా మార్పు చేసినట్లు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ పేర్కొన్నారు. టర్కీ విషయంలో ప్రభుత్వం మాకు అందించిన అధికారిక అభ్యర్థనపై తాము స్పందించామని అన్నారు. అదే విధంగా ఒకవేళ భారత్ నుండి అభ్యర్థన వస్తే.. తాము పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జి 20 విందుకు ఆహ్వానాలు పంపిన అనంతరం ఈ ఆందోళనలు చెలరేగాయి. ఆమె తన స్థానాన్ని 'భారత రాష్ట్రపతి' కి బదులు 'భారత అధ్యక్షురాలు' అని అభివర్ణించారు. బుధవారం జరిగిన క్యాబినెట్ మంత్రుల సమావేశంలో ప్రధాని ఇండియా భారత్ అంశంపై మాట్లాడవద్దని సూచనలిచ్చినట్లు సమాచారం.