జెనీవా : హైతీలో మహిళలు మరియు చిన్నారుల కిడ్నాప్‌లు ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునిసెఫ్) పత్రికా ప్రకటనను విడుదల చేసింది. 2023 మొదటి ఆరునెలల్లో సుమారు 300 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఇవి గతేడాది నమోదైన మొత్తం కేసుల సంఖ్యతో సరిపోలాయని, అలాగే 2021లో నమోదైన కేసుల కంటే సుమారు మూడు రెట్లు అధికమని వెల్లడించింది. చాలా సందర్భాల్లో ఆర్థిక, వ్యూహాత్మక లక్ష్యాల కోసం సాయుధ ముఠాలు మహిళలు మరియు చిన్నారులను కిడ్నాప్ చేస్తున్నాయని తెలిపింది. తిరిగి నివాసాలకు చేరుకున్న బాధితుల్లో అత్యధిక శాతం మంది చాలా ఏళ్లపాటు తీవ్రమైన శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొంది. '' బాధితుల గురించి యునిసెఫ్ అధికారులు, సహోద్యోగులు వెల్లడించిన అంశాలు తనని షాక్‌కు గురిచేశాయని లాటిన్ అమెరికా మరియు కరేబియన్‌లకు చెందిన యునిసెఫ్ ప్రాంతీయ డైరెక్టర్ గ్యారీ పేర్కొన్నారు. ఇవి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కానివని అన్నారు.
బేరసారాలు జరిపేందుకు మహిళలు, చిన్నారులు వస్తువులో, సరుకులో కాదని, వారు అటువంటి తీవ్రమైన హింసకు గురికాకూడదని అన్నారు. పెరుగుతున్న కిడ్నాప్‌లు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. హైతీ ప్రజలతో పాటు సాయం అందించేందుకు వచ్చిన వారిపై కూడా బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. సాయుధ ముఠాలు హింస, దోపిడీలు, రహదారుల దిగ్బంధనాలతో మానవతా సాయాన్ని తీవ్రంగా అడ్డుకుంటున్నాయని, దీంతో బాధితులకు అవసరమైన సాయం అందించడం కష్టతరమౌతోందని ఆ ప్రకటనలో పేర్కొంది.
హైతీలో కిడ్నాప్ అయిన మహిళలు, చిన్నారులను తక్షణమే విడుదల చేయాలని యునిసెఫ్ పిలుపునిచ్చింది. ఈ ఘటనలతో ప్రభావితమైన చిన్నారులకు సాయం, మద్దతు అందించేందు తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించింది. యుఎన్ నివేదికల ప్రకారం.. హైతీలో పరిస్థితి తీవ్ర ఆందోళన కరంగా ఉంది. సుమారు 3 మిలియన్ల చిన్నారులతో సహా సుమారు 5.2 మిలియన్ల జనాభా లేదా మొత్తం జనాభాలో సగం మందికి మానవతా సాయం అవసరమని అంచనా వేసింది.