
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రబీ సీజన్ ఎరువుల సబ్సిడీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం నాడిక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు తీసుకుంది. ఎరువులపై సూక్ష్మ పోషకాధారిత సబ్సిడీ (ఎన్‌బిఎస్) పరిమితికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేజీకి నత్రజని (ఎన్) రూ.98.02, ఫోస్ఫరస్ (భాస్వరం) (పి) రూ.66.93, పొటాష్ (కె) రూ.23.65, సల్ఫర్ (గంధకం) (ఎస్) రూ.6.12 సూక్ష్మ పోషక ఎరువులకుగాను వర్తించే సబ్సిడీపై కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖ ప్రతిపాదించిన రేట్లకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రబీ సీజన్ (2022 అక్టోబర్ 1 నుంచి 2023 మార్చి 31 వరకు)లో ఎరువులపై సబ్సిడీ రేట్లు వర్తిస్తాయని పేర్కొంది. ఎన్‌బిఎస్ సబ్సిడీకి మొత్తం రూ.51,875 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. దేశవాళీ ఎరువుల (ఎస్‌ఎస్‌పి) రవాణాపై ఇచ్చే సబ్సిడీ కూడా ఇందులో భాగంగా ఉంటుందని తెలిపింది. ఈ నిర్ణయంతో 2022-23 రబీలో రైతులకు ఎరువులన్నీ సబ్సిడీ, సరసమైన ధరలకు సజావుగా లభిస్తాయని పేర్కొంది. అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఈటానగర్‌లోని హోలోంగీ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు ''డోనీ పోలో ఎయయిర్ పోర్ట్, ఈటానగర్'' అనే పేరు పెట్టేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (ఈబిపి) ప్రోగ్రామ్ కింద పబ్లిక్ సెక్టార్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసిలు) ఇథనాల్ కొనుగోలు చేసే విధానానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఈఎ) ఆమోదం తెలిపింది. ఇథనాల్ సరఫరా సంవత్సరం (ఈఎస్‌వై) 2022-23 కోసం ప్రభుత్వ రంగ క్యూఎంసిలకు సరఫరా కోసం ఇథనాల్ ధరను సవరించడానికి కూడా ఆమోదించింది. 2022 డిసెంబర్ 1 నుండి 2023 అక్టోబర్ 31 వరకు రాబోయే చక్కెర సీజన్ 2022-23 కోసం ఇబిపి ప్రోగ్రామ్ కింద వివిధ చెరకు ఆధారిత ముడి పదార్థాల నుంచి ఇథనాల్ ధరను ఆమోదించింది. సి హెవి మొలాసిస్ మార్గం నుంచి ఇథనాల్ ధర లీటరుకు రూ.46.66 నుండి రూ.49.41కి, బి హెవి మొలాసిస్ మార్గం నుండి ఇథనాల్ ధర లీటరుకు రూ.59.08 నుండి రూ.60.73కి, చెరకు రసం, చక్కెర, షుగర్ సిరప్ రూట్ నుండి ఇథనాల్ ధర లీటరుకు రూ.63.45 నుంచి రూ.65.61కి పెరుగుతుంది.