Sep 11,2020 09:25

ప్రజల పన్నులు, లక్షల కోట్ల అప్పులు ఎటు పోతున్నాయి..?

* అభివృద్ది, సంక్షేమంపై కోతలు విధించిన మోడీ సర్కార్‌
* నాలుగు నెలల్లో అప్పులు మాత్రం రూ.8 లక్షల కోట్లు దాటాయి
* పెరిగిన వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజీల్‌ ధరలు
* ఎరువుల సబ్సిడీకి ఎగనామం..అప్పుల ఊబిలో ఎఫ్‌సీఐ
* సీజీఏ లెక్కల ప్రకారం 38శాతం వ్యయం తగ్గింది : ఆర్థిక నిపుణులు


కేంద్ర ప్రభుత్వం జులై నాటికి చేసిన అప్పులు రూ.8లక్షల కోట్లు దాటాయి. అయితే ఇదంతా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వ్యయం చేస్తున్నారనుకుంటే పొరపాటు. ఈ ఆర్థిక సంవత్సరం జులై నాటికి సబ్సిడీలపై ప్రభుత్వ వ్యయం 38శాతం తగ్గిందని 'కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఎకౌంట్స్‌' (సీజీఏ) తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఎరువుల సబ్సిడీ, ఆహార సబ్సిడీ, ఉపాధి హమీ పనులు...ఇలా అన్నింట్లోనూ కేంద్రం వ్యయ నియంత్రణ చర్యలకు దిగిందని సీజీఏ లెక్కల్లో స్పష్టంగా ఉంది. మరి...కేంద్రం చేసిన లక్షల కోట్ల అప్పులు, ప్రజల పన్నుల ద్వారా సమకూరిన ఆదాయం ఎటు పోతుందో తెలియని పరిస్థితి ఉందని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానించారు. మన ఆర్థిక విధానాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు.


న్యూఢిల్లీ : గత ఏడాదితో పోల్చితే, ఎరువుల సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వ వ్యయం(ఈ ఏడాది ఏప్రిల్‌-జులైలో) రూ.1173కోట్లు తగ్గింది. అలాగే పెట్రోలియం సబ్సిడీలో కోతలు విధించటం ద్వారా రూ.11,924కోట్లను మిగుల్చుకుంది. మొత్తం వ్యయంలో ఇది దాదాపు 42శాతం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కనిష్టస్థాయికి వచ్చినా.. మన దగ్గరమాత్రం ధరలు తగ్గించలేదు. పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఆహార సబ్సిడీలో రూ.51,476కోట్లు (47.4శాతం) కోతలు పెట్టారు. ఓ వైపు ప్రభుత్వ రంగ సంస్థల్ని తెగనమ్ముతున్నారు. మరోవైపు రెండు చేతులా ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేశారు. ఇదంతా కూడా ఈ సంక్షోభ సమయాన ప్రజల్ని ఆదుకోవడానికి మోడీ సర్కార్‌ వ్యయం చేస్తుందనుకుంటో పొరపాటు. ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్‌సీఐ..నిధులు కావాలంటే అప్పులు చేసుకోమని కేంద్రం చేతులు దులుపుకుంది. దాంతో ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అప్పుల ఊబిలో (రూ.1.4లక్షల కోట్లు) కూరుకుపోయింది.
సీజీఏ లెక్కల్లో ఏముంది?
ఈ ఏడాది జులై నాటికి కేంద్రంలో మోడీ సర్కార్‌ చేసిన కొత్త అప్పులు రూ.7.82లక్షల కోట్లు దాటింది. విదేశీ సంస్థల నుంచి మరో 39,165కోట్లు తీసుకుంది. ప్రతినెలా కేంద్రం ఎంత వ్యయం చేస్తున్నది? అనే లెక్కల్ని 'కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఎకౌంట్స్‌' (సీజీఏ) విడుదల చేస్తోంది. ఈ సీజీఏ లెక్కలు, కేంద్రం అప్పులు... పరిశీలించిన ఆర్థిక నిపుణులు, కేంద్ర ప్రభుత్వ వ్యయం దారుణంగా పడిపోయిందని తేల్చారు. సబ్సిడీలపై ప్రభుత్వ వ్యయం 38శాతం తగ్గినట్టు లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఓ వైపు భారీగా అప్పులు చేస్తున్నది. మరోవైపు సంక్షేమ, అభివృద్ధి రంగాల్లో భారీగా కోతలు విధిస్తున్నది. మరి జనం సొమ్ము ఎటు పోతోందన్న ప్రశ్న ఉదయిస్తున్నది. చేసిన అప్పులకు, చేస్తున్న వ్యయానికి పొంతన కుదరటం లేదని వారు అభిప్రాయపడ్డారు. సీజీఏ లెక్కల ప్రకారం, క్రితం ఏడాదితో (2018-19) పోల్చుకుంటే 2019-20లో ప్రభుత్వం 16శాతం పెరిగినట్టు చూపారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగదలను పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వ వ్యయంలో వాస్తవ పెరుగుదల 10.8శాతమే ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇది ఈ ఏడాది మార్చి 31వరకు జరిగిన సంగతి. ఇక ఈ ఏడాది (2020-21లో) జూన్‌ వరకూ జరిగిన వ్యయాన్ని పరిశీలిస్తే, వాస్తవ వ్యయంలో పెరుగుదల కేవలం 4.3శాతం మాత్రమే కనపడుతున్నది.
ఆర్థికమాంద్యం, నిరుద్యోగం, కరోనా వైరస్‌...వంటివి తీవ్ర స్థాయిలో ప్రజల్ని బాధిస్తున్నాయి. కాబట్టి గత ఏడాదితో పోల్చుకుంటే ప్రభుత్వ వ్యయం గణనీయంగా పెరగాల్సింది. ఇంతదాకా తీసుకున్న రూ.7.82లక్షల కోట్లు, విదేశీ అప్పులు ఏం చేశారో? దేనికి ఖర్చు చేశారో? తెలియని పరిస్థితి. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం రాష్ట్రాలకు ఏమైనా ఇచ్చారా? అంటే అదీ లేదు. ఆరోగ్యరంగంలో ప్రభుత్వం చేసిన వ్యయం అరకొరగానే ఉంది. మరి లక్షల కోట్ల అప్పులు, లక్షల కోట్ల బడ్జెట్‌, అదనంగా ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ...ఇదంతా ఏమైందో, ఎటు పోతుందో సామాన్యుడికి అర్థం కావటం లేదు.
ఏం చేశామన్నదే ముఖ్యం?
అప్పులు చేసైనా సరే...ఆర్థికమాంద్యం, కరోనా మహమ్మారి సృష్టించిన సమస్యల నుంచి దేశం బయటపడాలని ఆర్థిక నిపుణులు, ప్రతిపక్షాలు కేంద్రానికి సూచించాయి. అన్ని విభాగాల్లో ప్రభుత్వం వ్యయం పెరగాలని వారు కోరుతున్నారు. సంక్షేమ, అభివృద్దిరంగాల్లో జరిగే వ్యయం సామాన్యుడికి కొంతలో కొంత ఊరటనిస్తుంది. ఉపాధి హామీ పనులు, రైతు బీమా, రుణాలు, వడ్డీ మాఫీ, ఆహార సబ్సిడీలు..వంటివాటికి నిధుల సమస్య తలెత్తితే కోట్లాది మందిపై ప్రభావం చూపుతుంది. అయితే సీజీఏ విడుదల చేసిన లెక్కలు ప్రకారం, ప్రభుత్వ వ్యయం అనుకున్న స్థాయిలో పెరగలేదు. పెరగకపోగా...చాలావరకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టినట్టు, కోతలు విధించినట్టు అర్థమవుతున్నది.

ఆర్థిక వ్యవస్థ లేదా మార్కెట్లు...చురుకుగా ఉండాలంటే సామాన్యుడి చేతిలో నాలుగు రూపాయలుండాలి. రైతులు, కార్మికులు, అసంఘటితరంగంపై ఆధారపడ్డవారు.. వీరందరికి గత కొద్ది నెలలుగా దెబ్బమీద దెబ్బ పడుతున్నది. సంక్షేమం, అభివృద్ధి పనులపై ప్రభుత్వం చేసే వ్యయం మాత్రమే వారిని ఆదుకోగలదు. తద్వారా వీరి చేతుల్లోకి ఎంతో కొంత డబ్బులు వస్తేనే మార్కెట్లో కొనుగోళ్లు ఉంటాయి. స్వయం ఉపాధిరంగంలో ఉన్నవారికి బ్యాంకుల ద్వారా రుణాలు, అభివృద్ధి పనులతో నిరుద్యోగ సమస్యను పరిష్కరించొచ్చు. ఆహార సబ్సిడీ, ఉపాధి హామీ పనులు పేదల్ని ఆదుకుంటాయి. అయితే మోడీ సర్కార్‌ వీటిని పెద్దగా పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించటం లేదు. జన్‌ ధన్‌ ఖాతాల్లో కేవలం రూ.500 వేసేసి...అంతా అయిపోయిందని కేంద్రం చేతులు దులుపుకుంది.