సుప్రీం సాయం కోరిన రెవిన్యూ ఇంటెలిజెన్స్ డైరక్టరేట్
బయటపెట్టిన 'రాయిటర్స్'
న్యూఢిల్లీ : అదాని అక్రమాలను ఎంతగా కప్పిపుచ్చాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, అవి అంతగా బయటకు తన్నుకొస్తున్నాయి.బొగ్గు దిగుమతుల కుంభకోణంలో వేల కోట్ల రూపాయల ప్రజాధనం లూటీకి సంబంధించిన అక్రమాలపై తిరిగి విచారణ ప్రారంభించేందుకు వీలు కల్పించాలని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) సుప్రీం కోర్టును అభ్యర్థించింది. అదాని సంస్థ బగ్గు దిగుమతుల్లో బిల్లును మ్యానిపులేట్ చేసి అధిక విలువను చూపిందన్న ఆరోపణలపై సింగపూర్ నుంచి సాక్ష్యాధారాలను సేకరించడానికి వీలు కల్పించాలని కూడా డిఆర్‌ఐ కోరినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ఓ సంచలనాత్మక కథనాన్ని రాసింది. ఈ కేసులో అధికారులను విచారించకుండా దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని డిఆర్‌ఐ సుప్రీంను కోరింది. అదానీ అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు డిఆర్‌ఐ అనుమానం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను, పత్రాలను సేకరించకుండా భారత్, సింగపూర్‌లో అటు న్యాయపరంగా, ఇటు ఒత్తిళ్ల ద్వారా పదే పదే అడ్డుకునే యత్నాలు జరిగినట్లు ఆధారాలున్నాయని రాయిటర్స్ పేర్కొంది. బొగ్గు అక్రమాలపై విచారించడానికి సింగపూర్‌లో సాక్ష్యాలను సేకరించడానికి ఇంతక్రితం ముంబయి హైకోర్టు నిరాకరించింది. దీన్ని సవాల్ చేస్తూ కొన్ని రోజుల క్రితం డిఆర్‌ఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
- 2016 నుంచి కీలక పత్రాల సేకరణకు డిఆర్‌ఐ యత్నం
సింగపూర్ అధికారుల నుంచి అదాని లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను సేకరించేందుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ 2016 నుంచి ప్రయత్నిస్తోంది. ఇండోనేషియా సరఫరాదారుల నుంచి దిగుమతి చేసుకున్న బగ్గు సరుకులను మొదట దాని సింగపూర్ యూనిట్ అయిన అదానీ గ్లోబల్ పిటిఇకి తరలించినట్లు కాగితాలపై చూపించి.. అక్కడి నుంచి అధిక ధరలకు దిగుమతి చేసుకున్నట్లు డిఆర్‌ఐ పరిశోధనలో వెల్లడైంది.బొగ్గు దిగుమతులకు సంబంధించిన పత్రాలను గౌతం అదాని అనుబంధ కంపెనీలు ఇవ్వడానికి పదేపదే నిరాకరిస్తున్నాయని డిఆర్‌ఐ ఫిర్యాదు చేసింది. ఈ విషయమై డిఆర్‌ఐ అధికారులను రాయిటర్స్ సంప్రదించగా వారు స్పందించడానికి నిరాకరించారు.
అదాని గ్రూప్ ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గును.. అక్కడి ఎగుమతి విలువ కంటే భారీగా పెంచి చూపించడం వల్ల దేశంలో విద్యుత్ చార్జీలు సహా ఇతర ఇంధన భారాలు పెరిగిపోయాయి. వేల కోట్ల రూపాయల భారం ఈ దేశ ప్రజలపై పడింది. ఇది చాలా పెద్ద కుంభకోణమని హిండెన్‌బర్గ్, ఆతరువాత ఫైనాన్షియల్ టైమ్స్ వరుసగా వెల్లడించినా మోడీ ప్రభుత్వం మన్నుతిన్నపాములా మిన్నకుండింది. సింగపూర్ అధికారుల నుండి భారతదేశం కోరుతున్న సాక్ష్యం, అందులో అదానీకి చెందిన 20 బ్యాంకుల లావాదేవీల పత్రాలు ఉన్నాయి. డిఆర్‌ఐ తాజా అభ్యర్థనను సుప్రీంకోర్ట్ అనుమతించినట్లయితే.. ఆ వివరాలను విడుదల చేయడానికి సింగపూర్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ నుండి ఆర్డర్ పొందవలసి ఉంటుంది. అదాని గ్రూపు ఆర్థిక అక్రమాలపై ఈ ఏడాది జనవరిలో అమెరికన్ సంస్థ హిండెన్‌బర్గ్ విడుదల చేసిన నివేదిక విస్తృత చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ అరోపణలపై కూడా సుప్రీంకోర్టు విచారిస్తోంది. అదాని అక్రమాలపై మోడీ స్పందించకోవడం, పలు సంస్థలను కట్టబెట్టడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.