Oct 26,2023 08:50
  •  కేంద్ర మంత్రివర్గ నిర్ణయం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రబీ పంట సీజన్‌లో (2023 అక్టోబరు 1 నుంచి 2024 మార్చి 31) నత్రజని, భాస్వరం, పొటాష్‌, సల్ఫర్‌ వంటి వివిధ పోషకాల కోసం పోషక ఆధారిత సబ్సిడీ రేట్లను (ఎన్‌బిఎస్‌) కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. బుధవారం నాడిక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఎరువులపై సబ్సిడీ కోసం రూ.22,303 కోట్లు విడుదలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరిగినా.. రైతులు మాత్రం డిఎపి (డై అమోనియం ఫాస్పేట్‌) ఎరువును బస్తాకు రూ.1,350 చెల్లించి తీసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వివరాలు వెల్లడించారు. అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సిసిఇఎ), ఉత్తరాఖండ్‌లోని జమ్రానీ డ్యామ్‌ మల్టీపర్పస్‌ ప్రాజెక్టును ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన-వేగవంతమైన నీటిపారుదల ప్రయోజన కార్యక్రమం (పిఎంకెఎస్‌ వై-ఎఐబిపి) కింద, జలవనరులశాఖ కింద చేర్చడానికి ఆమోదించింది. 2028 మార్చి నాటికి రూ.2,584.10 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఉత్తరాఖండ్‌కు రూ.1,557.18 కోట్ల కేంద్ర మద్దతును సిసిఇఎ ఆమోదించింది.