- అంతర్జాతీయ ధరల బూచి
- రైతులకు ధరాఘాతమే
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి : కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీని భారీగా తగ్గించింది. నత్రజని, భాస్వరం, పొటాషియం, సల్ఫర్‌లకు కిలోగ్రాముకు ఇప్పుడిస్తున్న సబ్సిడీకి భారీగా కోతలు పెట్టింది. ఇటీవలి మంత్రివర్గ సమావేశం అనంతరం ఎరువుల సబ్సిడీని తగ్గిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. 2023-24లో సబ్సిడీని తగ్గించడంతో పాటు 2023లో జనవరి-ఏప్రిల్ కాలానికి సబ్సిడీని సైతం సవరించింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎరువులు, ఎరువుల తయారీకి ఉపయోగించే ముడిపదార్ధాలు. ఇంధన ధరలు గణనీయంగా తగ్గడమే సబ్సిడీ కోతలకు కారణమని పేర్కొంది. నిరుడు యూరియా ధర టన్ను 627 డాలర్లు (డాలరు = 82 రూపాయలు) ఉండగా ప్రస్తుతం 333 డాలర్లుగా ఉంది. అదేవిధంగా డిఎపి రేటు గతేడాది 925 డాలర్లు కాగా ఈ సంవత్సరం 540 డాలర్లకు తగ్గింది. నిరుడు ధర కంటే ఈ యేడు 42 శాతం మేర తగ్గింది. డిఎపి ధర నిరుడు టన్ను 1030 డాలర్లకు పెరిగింది. ఫాస్పారిక్ యాసిడ్, అమ్మోనియా ధరలు ఏడాది వ్యవధిలో 35ా80 శాతం తగ్గాయి. ఒక్క ఫాస్పారిక్ యాసిడ్ ధర నిరుడు ఏప్రిల్ కంటే ఈ ఏడాది మేలో 35.2 శాతం తగ్గింది. పూల్‌చేసిన గ్యాస్ ధర ఎంఎంబిటియు 27ా28 డాలర్ల నుంచి 12ా13 డాలర్లకు తగ్గింది. ఈ పరిస్థితులే సబ్సిడీ తగ్గింపునకు దారి తీశాయని కేంద్ర ప్రభుత్వం సమర్ధించుకుంటోంది. 2023ా24 బడ్జెట్ అంచనాల్లో ఎరువుల సబ్సిడీ 1.75 లక్షల కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా వేశారు. కాగా కొంత మంది అధికారులు మాత్రం రూ.50 వేల కోట్ల నుంచి 55 వేల కోట్లు ఎక్కువ ఉండొచ్చని చెబుతున్నారు.
- ధరలు ఎక్కువే
దేశంలో పాత నిల్వలు అధికంగా ఉన్నందున ప్రస్తుత ఖరీఫ్‌లో ఎరువుల ధరలు ఎక్కువే ఉండొచ్చన్న వాదనలూ ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు తగ్గినప్పటికీ పాత ధరల ప్రాతిపదికన ఎరువుల ఉత్పత్తి జరిగినందున ఖరీఫ్‌లో ధరలు తగ్గకపోవచ్చని, అంతర్జాతీయ పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వం సబ్సిడీ తగ్గిస్తే, రైతులకు ధరలు పెరగడమో లేదంటే ఇప్పుడున్న ధరలే ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో 15 మిలియన్ టన్నుల ఎరువుల నిల్వలున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 7.5 మిలియన్ టన్నుల యూరియా, 3.6 మిలియన్ టన్నుల డిఎపి, 4.5 మిలియన్ టన్నుల ఎన్‌పికె నిల్వలున్నాయి. ఇవి ఖరీఫ్ అవసరాలకు సరిపోతాయని చెబుతున్నారు.
- తగ్గనున్న దిగుమతులు
దేశీయంగా యూరియా ఉత్పత్తి సామర్ధ్యం పెరిగిందని, కొత్త ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమైందని, నానో యూరియాను ప్రవేశపెడుతున్నామని, ఈ కారణాల వలన యూరియా దిగుమతులు గతం కంటే తగ్గుతాయని అంచనా వేశారు. కాగా యూరియా ఉత్పత్తి పెరిగినప్పటికీ దిగుమతులు ఇంకా అవసరమవుతాయని, నానో యూరియా ఇంకా రైతులదాకా వెళ్లలేదని చెబుతున్నారు. ఈ పరిస్థితులన్నీ చక్కదిద్దకుండా ఎరువుల సబ్సిడీ తగ్గింపుపైనే కేంద్రం దృష్టి సారించింది.










