- రైతు వద్ద కొనే ధరకు, విక్రయ ధరకు భారీ వ్యత్యాసం
- రాష్ట్రంలో భారీగా పెరిగిన ఆహార ధాన్యాలు, పప్పుల ధరలు
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో రైతులకు మద్దతు ధరలు లభించడం ఒక ప్రహసనంగా మారింది. రైతులు వ్యవసాయం కోసం భారీగా పెట్టుబడులు పెరుగుతున్నా ఏటా అరకొరగానే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటిస్తోంది. ఏటా క్వింటాలుకు రూ.100 నుంచి రూ.200 మాత్రమే పెంచుతోంది. అయినా, ఆచరణలో ఈ ధర కూడా రైతులకు దక్కడం లేదు. రైతుల వద్ద ఉత్పత్తులు ఉన్నప్పుడు తక్కువ ధరకు కొనుగోలు చేయడం, కొద్ది నెలలకే ఈ ధరలను రెట్టింపు చేయడం వ్యాపారులు, దళారులకు పరిపాటిగా మారింది. ఉత్పత్తులను ఇళ్లల్లో నిల్వ చేసుకునే సామర్థ్యం లేక చాలామంది రైతులు తమ పంటలను కళ్లాల్లోనే విక్రయిస్తున్నారు. దీంతో, దళారులు ధరలను గణనీయంగా తగ్గించి కొంటున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, ఆచరణలో రైతుల వద్ద దళారులు ఉత్పత్తులు కొనుగోలు చేసి ఆర్‌బికెల్లో కొన్నట్టుగా రికార్డులు రూపొందిస్తున్నారు. పంట చేతికి వచ్చిన వెంటనే విక్రయించుకుంటున్న రైతులకు కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. 2022-23లో వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల కన్నా తక్కువ ధరకే రైతులు తమ పంటలను విక్రయించుకోవాల్సి వచ్చింది. గత మూడు నెలల్లో రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో, రైతుల పరిస్థితి అమ్మబోతే అడవి.... కొనబోతే కొరివి అన్న చందంగా తయారైంది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ ఏడాది రైతుల నుంచి ధాన్యం ధరలు కనీస మద్ధతు ధర కన్నా తక్కువగానే దళారులు కొనుగోలు చేశారు. ఉత్పత్తులు రైతుల నుంచి వ్యాపారులకు చేరాక అన్ని ఉత్పత్తుల ధరలనూ గణనీయంగా పెంచేశారు. ధాన్యం ధరలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం కిలో బియ్యం ధర రూ.50 నుంచి రూ.60 మధ్య ఉంది. కందిపప్పును కిలో రూ.170 నుంచి రూ.190 మధ్య విక్రయిస్తున్నారు. కిలో మినుపగుళ్లు ధర రూ.130 నుంచి రూ.140 ఉంది. గత కొన్ని నెలలుగా బియ్యం, పసుపు, పత్తి, పప్పు దినుసుల ధరలు గణనీయంగా పెరుగుతుండడంతో రైతులు బిక్కముఖం వేయాల్సి వస్తోంది. తమ వద్ద ఉత్పత్తులను తక్కువ ధరకు కొనడం, కొన్ని నెలల తర్వాత వాటిని అధిక ధరకు అమ్ముకోవడం పరిపాటిగా మారిందని, దీనివల్ల వినియోగదారులపైనా అధిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చింది
కందులకు క్వింటాలు ఒక్కంటికీ రూ.7 వేల చొప్పున మాత్రమే ధర లభించింది. పెట్టుబడి కూడా రాకపోవడంతో నష్టపోయాను. రైతుల వద్ద నుంచి దళారులు, వ్యాపారుల వద్దకు పంట వెళ్లగానే ధరలు పెంచారు. ఇప్పుడు ధర దాదాపు రెట్టింపు చేసి అమ్ముతున్నారు.
- గరికపాటి చిన తాతయ్య, కొనకంచివారిపాలెం,
రొంపిచర్ల మండలం, పల్నాడు జిల్లా
పెట్టుబడి పెరుగుతోంది
గత ఖరీఫ్‌లో పండిన కందులను దళారులు క్వింటాలును రూ.7,500 చొప్పున కొన్నారు. రబీలో పండిన మినుములను క్వింటాలు రూ.7,800కు కొను గోలు చేశారు. పెసలును రూ.5,500 నుంచి రూ.6 వేలు, శనగలను రూ.4,500 నుంచి రూ.5 వేలకు కొన్నారు. గత మూడు నెలలుగా అన్ని రకాల అపరాల ధరలూ గణనీయంగా పెరిగాయి. దళారుల వల్ల గిట్టుబాటు ధర రాక నష్టపోయాం. పెట్టుబడికి అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయిస్తే నష్టాల నుంచి కొంతవరకూ బయటపడతాం.
- ఈదర జనార్థనరావు, అన్నవరం గ్రామం, రొంపిచర్ల మండలం, పల్నాడు జిల్లా.
పెట్టుబడి ఖర్చూ రాలేదు
గత సంవత్సరం పంటపై పెట్టిన పెట్టుబడి రాకపోగా నష్టం వచ్చింది. మూడు ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. ఎకరానికి రూ.35 వేలకుపైగా పెట్టుబడి అయింది. ఎకరానికి ఐదు నుంచి ఆరు క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. కందులను క్వింటాలు ఒక్కంటికీ రూ.5,500 నుండి రూ.6,500 అమ్ముకోవాల్సి రావడంతో నష్టం వచ్చింది.
- ఎం .పిచ్చయ్య,
పిడుగురాళ్ల, పల్నాడు జిల్లా