- సైద్ధాంతికంగానే వ్యవస్థల ధ్వంసం
- ప్రతిపక్షాలు, పౌర సమాజం ప్రతిఘటించాలి
- ప్రజాశక్తి ఇంటర్వ్యూలో తీస్తా సెతల్వాద్
కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రజలపై యుద్ధం చేస్తోందని సామాజిక కార్యకర్త, జర్నలిస్టు, న్యాయవాది తీస్తా సెతల్వాద్ అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సమాఖ్య స్ఫూర్తి ఇలా అన్ని వ్యవస్థలపైనా బిజెపి ప్రభుత్వం సైద్ధాంతికంగా దాడులకు పాల్పడి ధ్వంసం చేస్తోందని ఆందోళన వెలిబుచ్చారు. ప్రస్తుతం దేశం, ప్రజల మనుగడ ప్రమాదంలో పడిందని తెలిపారు. ఆదివాసీలు, దళితులు, మహిళలపై అత్యాచారాలు, పైశాచిక దాడులు లక్ష్యపూరితంగానే సాగుతున్నాయన్నారు. గుజరాత్ నమూనాను అన్ని రాష్ట్రాలకు, యావత్ దేశానికి విస్తరించేందుకు బిజెపి, సంఘ పరివారం కుట్రలు పన్నుతోందని పేర్కొన్నారు. ప్రజలపై యుద్ధం ప్రకటించిన మోడీ సర్కారు, హిందూత్వ శక్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. గుంటూరులో జరుగుతున్న ఇండియన్ లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర మహాసభ పురస్కరించుకొని ఆదివారం ఏర్పాటు చేసిన సెమినార్‌లో ముఖ్యవక్తగా పాల్గొనేందుకు వచ్చిన తీస్తా సెతల్వాద్ ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధికి ఇంటర్వూ ఇచ్చారు. ఆ వివరాలు...
ప్రశ్న : 2002 నాటి గుజరాత్ హత్యాకాండ బాధితుల తరఫున పోరాడుతున్న మీపై కల్పిత ఆధారాలు సమర్పించారంటూ పోలీసులు కేసులు పెట్టారు. రాజ్యంతో పాటు న్యాయవ్యవస్థపై కూడా మీరు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. దీనిపై మీరేం చెబుతారు ?
జవాబు : ఈ అంశం న్యాయ వ్యవస్థ పరిధిలో ఉంది. దీనిపై నేను మాట్లాడటం సబబు కాదు.
ప్రశ్న: ఈ కాలంలో మతపరంగా మైనార్టీలు, దళితులపై విద్వేషపూరిత దాడుల పెరుగుదలను చూస్తున్నాం. వీటిపై ఏ విధంగా పోరాడాలి ?
జవాబు : 2014లో కేంద్రంలో బిజెపి అధికారంలోకొచ్చాక రాజకీయంగా, సైద్ధాంతికంగా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. అన్ని వ్యవస్థలను తన అధీనంలోకి తెచ్చుకుంటోంది. అంతా ఏకపక్షం చేసేస్తోంది. మీడియాను తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకుంటోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాను కబ్జా చేసింది. జాతీయ స్థాయిలో చాలా భాగం హిందీ ఛానల్స్ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నాయి. ఇంగ్లీషు ఛానల్స్ పరిస్థితీ అదే. కన్నడ, తమిళ ఛానల్స్‌లో కొంత వరకు, గుజరాత్‌లో మొత్తం ఛానల్స్ బిజెపి ఎజెండాకనుగుణంగా పని చేస్తున్నాయి. పనిగట్టుకొని ముస్లింలు, క్రైస్తవులకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఏది చెడ్డ వార్తో ఏది మంచి వార్తో అర్థం కాకుండా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి. ట్విటర్, వాట్సాప్, ఫేస్‌బుక్‌లలోనూ బిజెపి, పరివారం చొచ్చుకెళ్లి ప్రజల మెదళ్లలో విషం ఎక్కిస్తున్నాయి. ప్రతిపక్షాలు, పౌర సమాజం సమర్ధవంతంగా ఎదుర్కొవాలి. సోషల్ మీడియా, మీడియాను నైపుణ్యంతో నిర్వహించాలి. ఇదొక పెద్ద ఛాలెంజ్.
ప్రశ్న: యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి)పై చర్చ జరుగుతోంది, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?
జవాబు : ప్రజల మధ్య సమానత్వం సాధించాలన్నది రాజ్యాంగం నిర్దేశం. ఎన్నో కులాలు, మతాలు, ప్రాంతాలు కలిగిన వైవిధ్యభరిత దేశం మనది. ఎవరి అస్తిత్వం, సంప్రదాయాలు వారికి ఉన్నాయి. దక్షిణాది, ఉత్తరాది మధ్య వ్యత్యాసాలున్నాయి. ఆదివాసీలకు వారి తెగల సంప్రదాయాలున్నాయి. ఇన్నింటి మధ్య దేశ వ్యాప్తంగా అందరికీ ఒకే పౌర చట్టం ఇప్పుడప్పుడే సాధ్యం కాదు. మెల్లిగా అందరినీ ఒప్పించుకుంటూ చేయాలి. ముందుగా వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత విషయాల్లో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం సాధించాలి. మొన్నటికి మొన్న మోడీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చింది. ట్రిపుల్ తలాక్‌తో సహా పలు ఛాందస భావాలు, పద్ధతులు మారాలని అభ్యుదయ ముస్లిం మహిళలు, పురుషులు ఎప్పుడో కోరుకున్నారు. మాది స్పెషల్ మేరేజి. ఆ చట్టం కింద రిజిస్ట్రేషన్ జరిగింది. నేను హిందువు, నా భర్త ముస్లిం.
ప్రశ్న : బిల్కిస్‌బానో ఉదంతంపై మీ కామెంట్ ?
జవాబు : నాటి గుజరాత్ మారణహోమంలో గర్భిణిగా ఉన్న బిల్కిస్‌బానో గ్యాంగ్ రేప్‌కు గురైంది. ఆమె కుటుంబాన్ని హిందూత్వ మిగతా 3లో మతోన్మాద మూకలు హత్య చేశాయి. అంతటి తీవ్ర కేసులో శిక్ష పడ్డ నిందితులను కేంద్రంలో, గుజరాత్‌లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాలు స్వాతంత్య్ర రోజున క్షమాభిక్షపై విడుదల చేశాయి. ఇది అత్యంత దారుణమైనది. పరిపాలన, విధాన పరమైన లోపాలు జరిగాయి. ముద్దాయిలకు క్షమాభిక్ష... మతపరంగా టార్గెట్ చేసి రేప్ చేసినా విడుదల కావొచ్చన్న సందేశం ఇచ్చినట్లయింది.
ప్రశ్న: హక్కుల కార్యకర్తగా, మడమ తిప్పని జర్నలిస్టుగా పోరాడుతున్న మీకు పౌర సమాజం నుంచి ఎటువంటి మద్దతు లభిస్తోంది ?
జవాబు : నా పోరాటానికి పలు ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, ఎన్‌జిఒలు, అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్య, సెక్యులరిస్టుల నుంచి అపూర్వ మద్దతు లభించింది. నాపై రాజ్యం తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసినప్పుడు దేశ వ్యాప్తంగా పలువురి నుంచి సంఘీభావం లభించింది. పౌర సమాజం నుంచి వస్తున్న ఈ విశాల మద్దతు పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి నైతిక బలం ఇస్తోంది. నాలో ఆత్మస్తైర్యం నింపుతోంది.
ప్రశ్న: స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లయిన వేళ ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కుల భవితవ్యం గురించి...
జవాబు : 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు. అప్పుడు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. నేను అప్పుడు టెన్త్ క్లాస్‌లో ఉన్నాను. ప్రజలు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకు న్నారు. మళ్లీ ఇప్పుడు బిజెపి కేంద్రంలో వచ్చాక రాజ్యాంగ హక్కులకు, ప్రజాస్వా మ్యానికి ముప్పు వచ్చింది. నాటి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట స్ఫూర్తితో ప్రజలు పోరాడాలి.
ప్రశ్న : మణిపూర్ ఊచకోత, హర్యానా పరిస్థితులు దేశానికి ఏం సూచిస్తున్నాయి ?
జవాబు : 2002లో గుజరాత్‌లో మల్లేనే 2023లో మణిపూర్‌లో కిరాతకాలు జరుగుతున్నాయి. ఊచకోతను అణచివేయడంలో అక్కడి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపి డబుల్ ఇంజన్ ప్రభుత్వమే ఉంది. మూడు నెలల తర్వాత పార్లమెంట్‌లో హోం మంత్రి అత్యంత బాధ్యతారహితంగా మాట్లాడారు. మణిపూర్ ఘోరాలకు అస్సలు జవాబుదారీ తీసుకోవట్లేదు. హర్యానాలో మత అల్లర్లు ఎందుకు సంభవించాయి? కారకులెవరు? శాంతి సామరస్యం నెలకొల్పాల్సిన ప్రభుత్వాలు ఎందుకు కళ్లప్పగించి చూస్తున్నాయి ?
ప్రశ్న: దేశంలో లౌకికవాదాన్ని పరిరక్షించుకోడానికి యువత, మహిళలకు మీరు ఇచ్చే సలహా ?
జవాబు : సలహాలిచ్చేంత పెద్ద వ్యక్తిని కాదు. నేను చాలా చిన్న వ్యక్తిని. ప్రస్తుతం సెక్యులరిజానికి ప్రమాదం ఏర్పడింది. అప్రమత్తంగా ఉండి సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. సెక్యులరిజం లేనిదే మన దేశం లేదు. రక్షించుకునే బాధ్యతను యువత చేపట్టాలి.