ప్రమోద్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఒక రోజు రెండు మామిడి మొక్కల నాటు అంట్లను తీసుకునివచ్చి ఇంట్లో పెట్టాడు. 'బడి నుంచి వస్తున్నప్పుడు దారిలో రోడ్డుపక్కన పడి ఉండటం చూసి తెచ్చాను నాన్నా' అని తండ్రికి చెప్పాడు. 'మనకు పెరడు లేదుగా ఎక్కడ నాటుతావు' అని తండ్రి అడిగాడు. 'మా బడిలో నాటుతాను నాన్నా.. ఇలాంటి వాటికి మా హెడ్ మాస్టర్ గారు సంతోషంతో అంగీకరిస్తారు' అన్నాడు ప్రమోద్. అయితే ఆ రోజు ఉదయాన మామిడి మొక్కలు అలాగే ఉంచి బడికి వెళ్తున్న కొడుకును చూసి 'ప్రమోద్ ఆ మొక్కలు మరచిపోయినట్లున్నావ్ అన్నాడు' నాన్న. 'మొక్క నాటడానికి మంచి పోషకమైన మట్టి కావాలంట. మా బడికి కొద్ది దూరంలో వున్న దానయ్య వీధిలో ఉందని మా ఫ్రెండ్ చెప్పాడు. మట్టికోసం గోనె సంచి కూడా తీసుకొన్నాను' అని చెబుతూ సైకిల్‌పై వెళ్ళాడు ప్రమోద్. మరుసటి రోజు మామిడి మొక్కలు అలాగే వుంచి వెళుతూ 'నాన్నా ఈ రోజు మట్టి తీసుకెళ్తాను. రేపు ఆ చెట్లు నాటుతాను' అన్నాడు. 'అదేంటి నిన్న ఉదయం తీసుకెళ్లిన మట్టి చాల లేదా' అని నాన్న అడిగాడు. అప్పుడు. 'నిన్న ఉదయం మట్టి తీసుకెళ్తున్నప్పుడు అనుకోకుండా రోడ్డు మధ్యలో ఉన్న గుంతపై సైకిల్ పోవడం వలన నా స్నేహితుడు కింద పడ్డాడు. నాకు చాలా బాధేసింది. అందుకే నా దగ్గర ఉన్న మట్టిని ఆ గుంతను పూడ్చడానికి ఉపయోగించాను. ఈ రోజు తెచ్చే మట్టితో మొక్క నాటుతాను' అని చెప్పాడు ప్రమోద్. కొడుకు వంక సంతోషంగా చూస్తూ.. కొడుకు మంచి మనసుకు మనసులోనే తెగ మురిసిపోయేడు నాన్న.
- ఓట్ర ప్రకాష్ రావు
09787446026