Aug 05,2023 11:44

ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ (ఐఐపిఎస్‌) డైరెక్టర్‌ కె.ఎస్‌.జేమ్స్‌ను సస్పెండ్‌ చేయడానికి తమ వద్ద ప్రాధమిక ఆధారాలు వున్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఇది ప్రతీకారేచ్ఛతో తీసుకున్న చర్యేనన్నది స్పష్టం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) లను సిద్ధం చేసి, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు అందచేయడానికి ఐఐపిఎస్‌ యత్నించడమే నేరమైపోయింది. ఇటీవలి సంవత్సరాల్లో, ప్రభుత్వ విధానాలు, వాటి పర్యవసానాల గురించి ఇబ్బందికరమైన ఎటువంటి వాస్తవాలు బయటకు వచ్చినా సహించలేకపోతోంది. ఏ డేటానైనా, చివరికి తన సొంత సంస్థలే విడుదల చేసినా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఆ డేటాను ఒక ఫీడ్‌బ్యాక్‌గా ఉపయోగించుకోవడానికి బదులు శత్రుపూరిత వైఖరితో చూస్తోంది. ఉదాహరణకు, దేశంలోని అన్ని గ్రామాలు బహిరంగ మల విసర్జన రహితం (ఒడిఎఫ్‌)గా మారాయని 2019లో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఆ ప్రకటనలోని డొల్లతనం ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 (2019-21) సర్వేలో బయటపడింది. దేశంలో సర్వే చేసిన వాటిలో 19శాతం కుటుంబాలు ఎలాంటి టాయిలెట్‌ సౌకర్యాన్ని ఉపయోగించడం లేదని ఆ సర్వే నిగ్గుతేల్చింది. 2018 అక్టోబరులో జరిగిన నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ సర్వే, జాతీయ వార్షిక గ్రామీణ ప్రాంత పారిశుధ్య సర్వే 2019-20, ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన బహుళ సూచీల సర్వే ఇవన్నీ కూడా ఇప్పటికీ అనేక గ్రామాలు బహిరంగ మల విసర్జన రహితంగా లేవని పేర్కొన్నాయి. అలాగే ప్రజల్లో రక్తహీనత పెరిగిందని కూడా ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 సర్వే పేర్కొంది. ఉజ్వల యోజన ప్రభావాన్ని ప్రశ్నిస్తూ, సర్వే చేసిన గ్రామీణ కుటుంబాల్లో 57శాతం మందికి ఎల్‌పిజి కనెక్షన్‌ లేదని పేర్కొంది. ఇతర గణాంకాల ఫలితాలతో ఇటీవల కాలంలో ఏమి జరిగిందో కూడా తెలుస్తోంది. ద్రవ్యోల్బణం, దారిద్య్రానికి సంబంధించిన కీలకమైన సూచీలు 2011-12 నాటి వినిమయ వ్యయ సర్వే (సిఇఎస్‌)లతో ముడిపడి వున్నప్పటికీ డేటా నాణ్యత పట్ల తలెత్తుతున్న ఆందోళనలను సాకుగా చూపి 2017-18 సంవత్సరానికి వినిమయ వ్యయ సర్వేలను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. 2018లో జాతీయ గణాంకాల కమిషన్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ఓ చేపట్టిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వేకు అనుమతించినప్పటికీ నిరుద్యోగం పెరిగిందని సర్వేలో వెల్లడైనందుకు ఆ సర్వే ఫలితాలను నిలిపేశారు. 2019లో ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆ సర్వే ఫలితాలను వెల్లడించారు. సర్వే ఫలితాల వెల్లడిలో జరిగిన ఈ జాప్యం పట్ల, ఆలాగే గణాంకాల అంశాల్లో నీతి అయోగ్‌ జోక్యం పట్ల ఎన్‌ఎస్‌సి మాజీ తాత్కాలిక చైర్మన్‌, మరో సభ్యుడు రాజీనామా చేశారు.