న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ భద్రతను పర్యవేక్షించే ప్రత్యేక భద్రతా బృందం (స్పెషల్ ప్రొటెక్షన్ బృందం) డైరెక్టర్ అరుణ్‌కుమార్ సిన్హా (61) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అరుణ్‌కుమార్ గురుగ్రామ్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
కాగా, అరుణ్‌కుమార్ సిన్హా 1987 బ్యాచ్ కేరళ కేడర్ ఐపిఎస్ అధికారి. ఈయన 2016 నుండి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ డైరెక్టర్‌గా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత ప్రధానమంత్రులకు ప్రత్యేక భద్రత కల్పించే బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1885 నుంచి ఎస్‌పిజి అమల్లోకి వచ్చింది. ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రులకు, వారి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించే ఉద్దేశంతోనే ఈ ఎస్‌పిజిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రధాని కుటుంబ సభ్యులకు కాకుండా.. కేవలం ప్రధాన మంత్రికి మాత్రమే ఎస్‌పిజి భద్రత కల్పిస్తోంది. సిన్హా గతంలో తిరువనంతపురంలో డిసిపి కమీషనర్, ఐజి, అడ్మినిస్ట్రేషన్ ఐజిగా పనిచేశారు.