Oct 23,2023 10:45

లేహ్ : విధి నిర్వహణలో ఉన్న అగ్నివీర్‌ మరణించాడు. లడఖ్‌లోని హిమాలయ పర్వతాల్లో అత్యంత ఎత్తులో ఉన్న సియాచిన్‌ ఆర్మీ శిబిరంలో ఈ సంఘటన జరిగింది. లేహ్ లోని ఆర్మీ ప్రధాన కార్యాలయం ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ కార్ప్స్‌ ఆదివారం ఈ విషయం తెలిపింది. మహారాష్ట్రకు చెందిన అగ్నివీర్‌ గవాతే అక్షయ్ లక్ష్మణ్‌ మరణం పట్ల ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే, ఇతర సైనికాధికారులు సంతాపం తెలపడంతోపాటు నివాళి అర్పించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. అగ్నివీర్‌ లక్ష్మణ్‌ ఎలా చనిపోయాడనేది వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన కాంట్రాక్ట్‌ విధానం ద్వారా త్రివిధ దళాల్లోకి రిక్రూట్‌ చేసుకునే అగ్నివీర్‌ స్కీమ్‌పై దేశ వ్యాప్తంగా నిరసనలు, విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కారకోరం పర్వత శ్రేణిలో సుమారు 20,000 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్‌ హిమానీనదం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మిలిటరైజ్డ్‌ జోన్‌గా పేరుగాంచింది. దేశ రక్షణ కోసం ఇక్కడ విధులు నిర్వహించే భారత సైనికులు శత్రువులతోపాటు తీవ్రమైన చలి వాతావరణంతో పోరాడాల్సి ఉంటుంది. ఇక్కడి వాతావరణాన్ని తట్టుకోలేకపోవడం, పాదాలు, కాళ్లు, చేతులు మొద్దుబారడం వంటి అనారోగ్య సమస్యలను ఆర్మీ జవాన్లు తరచూ ఎదుర్కొంటున్నారు.