విజయవాడ వన్‌టౌన్: విజయవాడ నగరపాలక సంస్థలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. నాలాలపై మెష్‌లు ఏర్పాటు చేయని కారణంగా ఓ బాలుడు ప్రమాదవశాత్తు అందులోని పడి మృతి చెందాడు. విజయవాడ 56వ డివిజన్ పాత రాజరాజేశ్వరి పేటలో ఈ ఘటన జరిగింది. అష్రఫ్ (5) అనే బాలుడు బుధవారం ఆడుకుంటూ ఇంటిపక్కనే ఉన్న పెద్ద నాలాలో పడి మృతి చెందారు. ఈ విషయం తెలియని తల్లిదండ్రులు బాలుడి ఆచూకీ కోసం తీవ్రంగా వెతికారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడి ఇంటి ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు పరిశీలించగా పోలీసులకు ఎక్కడా ఆచూకీ కనిపించలేదు. దీంతో ఇంటిపక్కన ఉన్న నాలాలోనే పడి ఉంటాడనే అనుమానంతో చుట్టపక్కల వెతికారు. ఇంటికి కొద్దిదూరంలో నాలాలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.