Sep 07,2023 16:43

కీవ్‌ :   నూతన రక్షణ మంత్రిగా క్రిమియా నేత రుస్తెమ్‌ ఉమ్‌రోవ్‌ నియామకాన్ని ఉక్రెయిన్‌ పార్లమెంట్‌ బుధవారం ఆమోదించింది. 18 నెలల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలు చేపట్టిన అనంతరం ఉక్రెయిన్‌ రక్షణ వ్యవస్థలో ఇది అదిపెద్ద మార్పు కానుంది. పార్లమెంటు ఉమ్‌రోవ్‌కు మద్దతుగా అత్యధిక ఓట్లు వేసిన అనంతరం తమ ప్రధాన లక్ష్యం విజయం అని ఫేస్‌బుక్‌లో ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ విజయం కోసం సాధ్యమైనంతవరకు కృషి చేస్తానని, దేశంలోని ప్రతి సెంటీ మీటర్‌ భూమి, ప్రతి వ్యక్తిని విముక్తి చేయడం కోసం పోరాడతానని పేర్కొన్నారు.

మాజీ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్‌ పశ్చిమదేశాల నుండి బిలియన్‌ డాలర్ల సైనిక సాయం పొందేందుకు తీవ్రంగా కృషి చేశారు. అయితే మంత్రిత్వ శాఖలో అవినీతికి పాల్పడినట్లు మీడియా ఆరోపణలతో ఒలెక్సీని ఆ పదవి నుండి గత ఆదివారం అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తొలగించారు. '' ఒలెక్సీ రెజ్నికోవ్‌ స్వయంగా అవినీతి ఆరోపణలను ఎదుర్కోలేదు. కానీ ఆయన మీడియా ప్రచారానికి బాధితుడిగా నిలిచాడు. అయితే ఆయన తొలగింపు ఉక్రెయిన్‌సైనిక వ్యూహాన్ని ప్రభావితం చేయలేదు'' అని సంబంధిత వర్గాలు తెలిపాయి. రెజ్నికోవ్‌ను తొలగించాలని జెలెన్‌స్కీ నిర్ణయంతో ఆయన తన రాజీనామాను సమర్పించారు. అనంతరం రెజ్నికోవ్‌ తొలగింపును చట్టసభ సభ్యులు ఆమోదించారు.