న్యూఢిల్లీ : బిఎస్‌పి నేత డానిష్ అలీపై బిజెపి ఎంపి రమేష్ బిధురి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటువంటి ప్రవర్తన పునరావృతమైతే.. కఠిన చర్యలు ఎదుర్కోవలసి వుంటుందని స్పీకర్ ఓం బిర్లా బిజెపి ఎంపిని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించారు. అయితే ఈ ఘటన అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బిజెపి ఎంపి వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ.. క్షమాపణలు తెలిపారు. లోక్‌సభలో చంద్రయాన్-3 మిషన్ సక్సెస్‌పై చర్చ సందర్భంగా ముస్లిం ఎంపి డానిష్ అలీపై రమేష్ బిధురి ఉపయోగించిన అభ్యంతరకర పదాలను స్పీకర్ తీవ్రంగా పరిగణించారని అధికారులు శుక్రవారం తెలిపారు.
''మీ నాయకత్వంలో కొత్త పార్లమెంటు భవనంలో జరిగిన ఘటన దేశంలోని మైనారిటీ సభ్యుడిగా, ఎంపిగా నా హృదయాన్ని కలిచివేసింది'' అని డానిష్ అలీ స్పీకర్‌కు లేఖ రాశారు. తనపై చేసిన వ్యాఖ్యలను ప్రివిలేజీ కమిటీ పరిశీలనకు పంపాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
బిజెపి ఎంపి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. గత సెషన్‌లో మంత్రులను అవమానించారని ఆరోపిస్తూ అధిర్ రంజన్ చౌదరిని సస్పెండ్ చేశారని కాంగ్రెస్ పేర్కొంది. ఒక బిజెపి ఎంపి దారుణంగా మాట్లాడినా ఎటువంటి చర్య తీసుకోలేదని మండిపడింది. ఇది పార్లమెంటుకు అవమానకరం. రాజ్‌నాథ్ సింగ్ క్షమాపణలు ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిధురి ప్రకటన ప్రతి భారతీయుడిని అవమానించిందని, ఇది సస్పెన్షన్ కేసు అని అన్నారు.
బిధురిపై చర్యలు తీసుకోవాలని టిఎంసి ఎంపి మహువా మొయిత్రి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను డిమాండ్ చేశారు. రమేష్ బిదురిపై ఏం చర్యలు చేపడతారో వెల్లడించాలని ఆమె ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. ముస్లింలు, ఒబిసిలను అవమానించడం బిజెపి సంస్కృతిలో భాగమని ఆమె ధ్వజమెత్తారు. ఇది ముస్లింలపై బిజెపి వైఖరిని చూపుతోందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. కొత్త పార్లమెంటులో పాత మనస్తత్వమని అన్నారు. బిధురిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆప్ ఎంపి సంజరు సింగ్ కోరారు.