Nov 11,2023 11:33

ఎంపిలో కేంద్ర మంత్రి కుమారుడి వీడియో వైరల్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో: కేంద్ర వ్యవసాయ మంత్రి, మధ్యప్రదేశ్‌ బిజెపి నాయకుడు నరేంద్ర సింగ్‌ తోమర్‌ కుమారుడు దేవేంద్ర ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ కోట్లాది లావాదేవీలపై చర్చిస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో దేవేంద్ర ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ ఒక వ్యక్తితో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడుతున్నట్లు, రూ.100 కోట్ల విలువైన నిధులను ''తరలించడం'' గురించి చర్చిస్తున్నట్లు కనిపిస్తుంది. మరో కాల్‌ రికార్డింగ్‌లో ''తన రూ.18 కోట్లు'' నాలుగు వేర్వేరు బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయని ఒక వ్యక్తి తోమర్‌కి చెప్పడం వినిపిస్తుంది. ఈ నెల 17న మధ్య ప్రదేశ్‌ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో నరేంద్ర సింగ్‌ తోమర్‌ దిమాని అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడం ప్రాథాన్యత సంతరించుకుంది.
కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్‌ను బర్తరఫ్‌ చేయాలి : కాంగ్రెస్‌
ఈ వీడియోపై న్యాయ విచారణకు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌, దర్యాప్తు పూర్తయ్యే వరకు కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. ''నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఢిల్లీలోనే కాదు, మధ్యప్రదేశ్‌లో కూడా శక్తివంతమైన వ్యక్తి. ఆయన కుమారుడిని అరెస్టు చేసే వరకు స్వేచ్ఛగా, న్యాయమైన విచారణ సాధ్యం కాదు'' అని కాంగ్రెస్‌కు చెందిన సుప్రియా శ్రీనాట్‌ అన్నారు. మనీలాండరింగ్‌ కేసు నమోదు చేయాలని కూడా కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.