న్యూఢిల్లీ : బిజెపి ఎంపి రమేష్ బిధూరిపై అనర్హతవేటు వేయాలని దేశంలోని ప్రముఖ ముస్లిం సంఘాలు పిలుపునిచ్చాయి. అలాగే పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. బహుజన సమాజ్ పార్టీ ఎంపి దనీష్ అలీపై గురువారం రాత్రి లోక్‌సభ వేధికగా దూషణలకు దిగిన సంగతి తెలిసిందే. చంద్రయాన్-3 విజయంపై చర్చ సమయంలో బిజెపి ఎంపి దనీష్ అలీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. ముస్లిం కమ్యూనిటీపై విద్వేషానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమని పేర్కొన్నాయి. పార్లమెంటులో ముస్లిం సభ్యులపై ఇటువంటి పదజాలాన్ని ప్రయోగించడంతో సామాన్య ముస్లింల సంగతి పక్కన పెడితే.. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ముస్లిం సభ్యులకు కూడా భద్రత లేదని స్పష్టమౌతోందని జమియత్ ఉలమా -ఇ- హింద్ అధ్యక్షుడు అర్షద్ మదానీ మీడియాతో పేర్కొన్నారు. అటువంటి సభ్యులపై చర్యలు తీసుకోవడం స్పీకర్ రాజ్యాంగ, నైతిక బాధ్యత అని అన్నారు. గతంలో కూడా పార్లమెంటులో పెద్ద ఎత్తున వాడివేడి వాదోపవాదాలు, చర్చలు జరిగాయి. కానీ ఏ సభ్యుడు కూడా తనతోటి ప్రజాప్రతినిధులపై ఇటువంటి అసభ్య పదజాలాన్ని వాడలేదని అన్నారు. ఇది ముస్లింల పట్ల వ్యక్తమౌతున్న విద్వేషానికి నిదర్శమని అన్నారు.
రమేష్ బిధూరి వ్యాఖ్యలు ద్వేషపూరిత నేరానికి సమానమని, పార్లమెంట్ సభ్యునికి తీవ్ర భంగం కలిగించారని జమియత్ ఉలమా -ఇ- హింద్ వ్యాఖ్యానించింది. నేరస్తులు మరియు సామాజిక వ్యతిరేక వ్యక్తులు మాత్రమే నిర్దిష్ట సమాజంలోని సభ్యులను కించపరిచేందుకు ఇటువంటి అభ్యంతరకరమైన పదాలను ప్రయోగిస్తారని పేర్కొంది. అధికారంలో ఉన్నవారు పాటించే నిరంతర సంకుచిత మనస్తత్వం సహజ పరిణామమని, కుకీలు, ముస్లింలు, దళితులు, ఆదివాసీలు పై విద్వేషాన్ని పెంచిపోషిస్తున్నారని .. ఇదే ఇప్పుడు బహిర్గతమైందని స్పష్టం చేసింది. రమేష బిధూరిపై చర్యలు చేపట్టకపోవడం ఈ చర్యలు సాధారణమేననే సందేశాన్ని పంపుతోందని, పరస్పర గౌరవం, పరమత సహానం విలువలను దెబ్బతీస్తోందని పేర్కొంది.
రమేష్ బిధూరి వ్యాఖ్యలు బిజెపి సిద్ధాంతానికి అనుకూలంగా వుండవచ్చని.. కానీ ఇవి రాజ్యాంగ మరియు పార్లమెంటరీ విధానాలకు వ్యతిరేకమనివెల్ఫేర్ పార్టీ అధ్యక్షుడు ఎస్.క్యూ.ఆర్ ఇలియాస్ మండిపడ్డారు. అతనిపై చర్యలు తీసుకోవానలి బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాను కోరారు.