- కడప నగరంలో ముస్లిముల శాంతి ర్యాలీ
ప్రజాశక్తి - కడప అర్బన్:పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను ఆపి శాంతిని నెలకొల్పాలని ముస్లిము మతపెద్దలు, ప్రజా సంఘాల నాయకులు కోరారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ ముస్లిము మైనార్టీల ఆధ్వర్యంలో శనివారం కడపలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. నబికోట నుంచి ప్రారంభమై ర్యాలీ పాతబస్టాండ్, నాగరాజుపేట, ఎన్‌టిఆర్ సర్కిల్ మీదుగా ఏడు రోడ్ల కూడలికి చేరుకుంది. ర్యాలీలో భారతదేశ జాతీయ జెండాతో పాటు పాలస్తీనా జాతీయ జెండా రెపరెపలాడాయి. పాలస్తీనాకు భారత ప్రభుత్వం మద్దతు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఏడురోడ్ల వద్ద ర్యాలీని ఉద్దేశించి సలావుద్దీన్, అమీర్‌బాబు, చంద్రశేఖర్, ఈశ్వరయ్య, మత పెద్దలు మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకుని దాడులను ఆపాలని కోరారు. ఇప్పటికే ఐదు వేల మంది అమాయక ప్రజలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాలీలో సంఘసేవకులు సయ్యద్ సలావుద్దీన్, సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, టిడిపి కడప నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జి అమీర్‌బాబు, సిపిఐ రాష్ట్ర నాయకులు ఈశ్వరయ్య, పిడిఎస్‌యు రాష్ట్ర సహాయ కార్యదర్శి అంకన్న, మతగురువు జాకీర్ హుస్సేన్, మతపెద్దలు పాల్గొన్నారు.