Oct 14,2023 15:10
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి-విజయవాడ : ముఖ్యమంత్రి జగన్ విజయవాడలో ఉద్ధరించింది ఏమిటి? ఇప్పుడు విశాఖపట్నం వెళ్లి అభివృద్ధి చేసేది ఏమిటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల పేరుతో లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని మండిపడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికై  8 రోజులుగా సాగిన ప్రజా పోరుబాట ముగింపు సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబురావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో  శ్రీనివాసరావు ప్రసంగిస్తూ.... ప్రధాన పార్టీలన్నీ బూతు రాజకీయాల సాగిస్తూ ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో ప్రతి సంవత్సరం 25 లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుండి వసూలు చేస్తూ కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నదని ఆగ్రహించారు. అభివృద్ధిని విస్మరించిందని, హామీలను తుంగలో తొక్కి, ప్రజలపై పలు రూపాలలో భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం కేంద్రంతో జతకట్టి అదానీ, కార్పొరేట్లకు సహజ వనరులను కట్టబెడుతున్నదని తెలిపారు. మన రాష్ట్రంలోని కేజీ. బేసిన్ నుండి గ్యాస్ ఉత్పత్తి అవుతుండగా, 400 రూపాయలకే గ్యాస్ ఇచ్చే అవకాశం ఉన్నా రూ.950 కు పెంచడం శోచనీయమన్నారు. సోలార్ విద్యుత్ యూనిట్ కి రూపాయికి ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నా, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం భారీగా విద్యుత్ ఛార్జీలను పెంచారని వెల్లడించారు. పేదలకు ఇళ్లు, పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వాలు నమ్మకద్రోహం చేశాయని పేర్కొన్నారు. పౌర సదుపాయాలను వ్యాపారమయం చేశాయని తెలిపారు. ప్రజారోగ్యం దెబ్బతిని జ్వరాలు విజృంభిస్తున్నా పాలకులు మొద్దు నిద్రలో ఉన్నారని తెలిపారు. భవిష్యత్తులో ఉద్యమాలను ఉధృతం చేస్తామని తెలిపారు. ప్రజల సమస్యలే ఎజెండాగా సిపిఎం రాజకీయ పోరాటం సాగిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగట్టడానికి సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి ముఖ్య అతిధిగా నవంబర్ 15వ తేదీన విజయవాడలో ప్రజా రక్షణ భేరి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుండి బస్సు యాత్రలు నడుపుతామని తెలిపారు.  ప్రజలందరూ ఈ రక్షణ భేరి సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

సిహెచ్ బాబురావు మాట్లాడుతూ.... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాలను అణిచివేస్తూ, ప్రతిపక్షాలపై దాడులు చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారాన్ని గాలికి వదిలేశాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను నిండా ముంచారు, వివిధ తరగతుల ప్రజలు ప్రభుత్వాల విధానాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.  ప్రజల ఆదాయాలను పెంచాల్సిన ప్రభుత్వాలు భారాలను పెంచుతున్నాయని, ప్రజలను కొల్ల గొడుతున్నాయని వివరించారు. ఇళ్లు, పట్టాలు, సంక్షేమ పథకాలు తదితర హామీలను గాలికి వదిలేశారని, ఇళ్ల నిర్మాణాలపై ముఖ్యమంత్రి గొప్పలు చెప్పటమే తప్ప చేసింది స్వల్పమేనని పేర్కొన్నారు. విజయవాడలో గృహ నిర్మాణం పై అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు బహిరంగ చర్చకు సిద్ధం కాగలరా అని ప్రశ్నించారు. సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లాది విష్ణు నగరాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించకుండా అవినీతి, అక్రమాలకు ప్రణాళికలు రూపొందించారని మండిపడ్డారు. వైసిపి..  కేంద్రం, బిజెపితో జతకట్టి రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టిందని ఆగ్రహించారు. ప్రధాన పార్టీలన్నీ అవినీతి ఆరోపణలతో మునిగి తేలుతున్నాయని, అవినీతి మరక అంటకుండా నిజాయితీగా పని చేస్తున్నది సిపిఎం, వామపక్షాలు మాత్రమేనని తెలిపారు. భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తాంమని నగర ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకై ప్రజాప్రతినిధులను నిలదీస్తామని వెల్లడించారు. నేడు జరిగిన ముగింపు సభలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డి.కాశీనాథ్, నగర నాయకులు బి.రమణరావు, కే.సరోజ, ఎం.సీతారాములు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

cpm-praja-porubata-rally-in-vijayawada-rally