Oct 21,2023 22:30

కైరో, లండన్‌: గాజాపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దారుణ మారణకాండను ఆపాలని, మానవతా సాయాన్ని అందజేయాలని కోరుతూ కైరో, లండన్‌లలో లక్షలాదిమందితో భారీ ర్యాలీలు నిర్వహించారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం ఈజిప్టు రాజధాని కైరోలో ప్రజలు పెద్దయెత్తున గుమికూడి రాజధాని వీధుల్లో కదంతొక్కారు. 'మీ కోసం మేం త్యాగాలు చేస్తాం పాలస్తీనా' అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. పాలస్తీనీయులకు పూర్తి సంఘీభావం తెలుపుతూ లండన్‌లోనూ అపూర్వమైన రీతిలో ప్రదర్శన జరిగింది. గత శనివారం లక్షా 50వేల మందితో ప్రదర్శన జరిగితే ఈవారం అంతకంటే ఎక్కువమంది హాజరయ్యారని పాలస్తీనా సంఘీభావ క్యాంపెయిన్‌ డైరెక్టర్‌ బెన్‌ జమాల్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. హింసకు మూల కారణాన్ని పరిష్కరించనిదే ఈ ఉద్రిక్తతలు చల్లారవని ఆయన అభిప్రాయపడ్డారు.
కైరోలో సమిష్టి ప్రార్ధనల అనంతరం 'ఈజిప్ట్‌ ఫ్రైడే' పేరుతో నిర్వహించిన ర్యాలీలో పాలస్తీనా పతాకాలు, 'సేవ్‌ గాజా' పోస్టర్లు పెద్దయెత్తున ప్రదర్శించారు. కైరోలోని నాసర్‌ సిటీ ప్రధాన వీధుల గుండా ఈ ప్రదర్శన జరిగింది.
గాజాపై హంతక యుద్ధ నేరాలు ఆపాలని, ఐక్యరాజ్య సమితి తీర్మానాల ప్రకారం స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు చేయాలని కోరుతూ లండన్‌ డౌన్‌స్ట్రీట్‌లో గత కొన్ని రోజులుగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే శనివారం వివిధ ప్రగతిశీల, శాంతి కాముక సంస్థలు, ప్రజాతంత్రవాదులు ఇచ్చిన పిలుపు మేరకు లక్షలాది మందితో జరిగిన ప్రదర్శన మరో ఎత్తు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జర్మనీ అద్యక్షుడు ఒలాఫ్‌ షుల్జ్‌ ఇజ్రాయిల్‌కు వెళ్లి యుద్దోన్మాది నెతన్యాహ ఈ యుద్ధంలో గెలవాలని, అందుకు అవసరమైన ఆయుధాలు, నిధులు సమకూర్చుతామని హామీ ఇవ్వడాన్ని ప్రదర్శకులు తీవ్రంగా వ్యతిరేకించారు. దశాబ్దాలుగా సైనిక అణచివేత, వర్ణ వివక్ష, పాలస్తీనీయులపై అణచివేతకు పాల్పడుతున్న రాజ్యానికి ఈ దేశాల అధినేతలు మద్దతు ఇవ్వడం సిగ్గు సిగ్గు అని వారు ఎద్దేవా చేశారు. సునాక్‌, బైడెన్‌ వ్యాఖ్యలు ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణకాండకు ఆమోదం తెలిపేవిగా వున్నాయని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు విమర్శించాయి.

  • పాలస్తీనీయులకు అండగా నిలిచిన గ్రెటా థన్‌బర్గ్‌

ఇజ్రాయిల్‌ దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న పాలస్తీనా, గాజా వాసులకు వాతావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ అండగా నిలిచారు. తనతోపాటు మరో నలుగురు కార్యకర్తలు పాలస్తీనా, గాజాకు సంఘీభావం తెలుపుతూ ప్లకార్డు పట్టుకుని ఉన్న ఫొటోలను గ్రెటా తన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. గ్రెటా పాలస్తీనాకు సంఘీభావం తెలపడంపై ఇజ్రాయెల్‌ ఆక్రోశం వెళ్లగక్కింది. హమాస్‌ దాడిలో హత్యకు గురైన ముగ్గురు 19 ఏళ్ల ఇజ్రాయిలీయుల ఫొటోలను పోస్ట్‌ చేసి దీనికి మీ సమాధానం ఏమిటి? అని ఎదురుదాడి చేసింది. దీనికి గ్రెటా దీటుగానే బదులిచ్చారు 'స్టాండ్‌ విత్‌ గాజా' అనే ప్లకార్డును తాను పట్టుకుని ఉన్న ఫొటోను ఎక్స్‌లో పోస్టు చేశారు. 'ఈరోజు మేము పాలస్తీనా, గాజాకు సంఘీభావంగా సమ్మె చేస్తున్నాం. తక్షణమే కాల్పులు విరమించండి. పాలస్తీనియన్లకు, బాధిత పౌరులకు స్వేచ్ఛ, న్యాయం కోసం ప్రపంచం మాట్లాడాలి' అని పేర్కొన్నారు. సోషల్‌మీడియాలో గ్రెటా థన్‌బర్గ్‌ పోస్ట్‌ వైరల్‌గా మారింది. నెటిజన్లు గ్రెటాకు మద్దతునిస్తున్నారు.