Oct 22,2023 08:55
  •  20 ట్రక్కులతో ఆహారం, మందులు

గాజా : ఇజ్రాయిల్‌ విధించిన అమానుషమైన ఆంక్షలు, దిగ్బంధనంతో ఆకలి కోరల్లో చిక్కుకున్న గాజా ప్రజల కోసం ఉద్దేశించిన ఆహార పదార్థాలు, మందులను తీసుకుని 20 రెడ్‌ క్రీసెంట్‌ ట్రక్కులు గాజాలో ప్రవేశించాయి. వీటిలో ఇంధనం లేదు. ఇబ్బందులు పడుతున్న ప్రజల సంఖ్యతో పోల్చుకుంటే ఈ 20 ట్రక్కుల సాయం ఏమూలకూ సరిపోదని సహాయక గ్రూపులు పేర్కొంటున్నాయి. ఈ ఘర్షణలను పరిష్కరించేందుకు ఈజిప్ట్‌ అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఒకపక్క యుద్ధాన్ని అంతమొందించేందుకు యత్నాలు జరుగుతున్నా ఇజ్రాయిల్‌ ఏమాత్రం పట్టించుకోకుండా గాజాపై బాంబు దాడులు సాగిస్తూనే ఉంది.
అంతర్జాతీయ చట్టాలను గౌరవించి, గాజాలో ప్రజల ప్రాణాలను కాపాడాలని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లావర్లీ ఇజ్రాయిల్‌ మిలటరీ, ప్రభుత్వాలను కోరారు. కైరో శాంతి సదస్సులో ఆయన మాట్లాడారు. శాంతియుత సహజీవనమే అంతిమంగా విజయం సాధిస్తుందని అన్నారు.

  • రెండు దేశాల ఏర్పాటు దిశగా ప్రణాళిక

గాజాలో ఉద్రిక్త పరిస్థితులను నివారించేలా, రెండు దేశాల ఏర్పాటు పరిష్కారం దిశగా ఒక ప్రణాళికను రూపొందించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటలీ, గ్రీక్‌ నేతలు కైరో శాంతి సదస్సులో అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. కొత్త శాంతి క్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కూడా గ్రీక్‌ ప్రధాని కిరియాకోస్‌ మిత్సోతకిస్‌ పిలుపిచ్చారు. సుస్థిరమైన రాజకీయ పరిష్కారం మినహా మరే ఇతర మిలటరీ జోక్యాలు ఈ సమస్యను పరిష్కరించలేవని అన్నారు.