Oct 21,2023 17:33

గాజా : వేలాది మంది పాలస్తీనా పౌరుల్ని ఇజ్రాయెల్‌ హతమారుస్తోంది. గత కొన్నిరోజులుగా జరుగుతున్న పాలస్తీనా, ఇజ్రాయెల్‌ల మధ్య నెలకొన్న యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పాలస్తీనా, గాజాకు వాతావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ తన మద్దతునిచ్చారు. ఈ సందర్భంగా తనతోపాటు మరో నలుగురు కార్యకర్తలు పాలస్తీనా, గాజాకు సంఘీభావం తెలుపుతూ ప్లకార్డు పట్టుకుని ఉన్న ఫొటోలను గ్రెటా తన ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. అయితే గ్రెటా పాలస్తీనాకు సంఘీభావం తెలపడంతో ఇజ్రాయెల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రెటా పోస్టుకు ఇజ్రాయెల్‌ తీవ్రంగా స్పందించింది. 'అమాయక ఇజ్రాయెల్‌లను చంపిన హమాస్‌.. తమ రాకెట్ల కోసం స్థిరమైన పదార్థాలను ఉపయోగించలేదు. హమాస్‌ ఊచకోత బాధితులు మీ స్నేహితులు కావొచ్చు. దీనిపై మాట్లాడండి.' అని ఇజ్రాయెల్‌ ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొంది. అలాగే హమాస్‌ దాడిలో హత్యకు గురైన ముగ్గురు 19 ఏళ్ల ఇజ్రాయిలీల ఫొటోలను కూడా ఇజ్రాయెల్‌ పోస్ట్‌ చేసింది. అయితే ఇజ్రాయిల్‌ స్పందనకు గ్రెటా కూడా తీవ్రంగానే స్పందించింది. ఈ సందర్భంగా గ్రెటా 'స్టాండ్‌ విత్‌ గాజా' అనే ప్లకార్డును పట్టుకుని ఉన్న ఫొటోను ఎక్స్‌లో పోస్టు చేసింది. దీనితోపాటు 'ఈరోజు మేము పాలస్తీనా, గాజాకు సంఘీభావంగా సమ్మె చేస్తున్నాము. తక్షణమే కాల్పుల విరమణకు. పాలస్తీనియన్లకు, బాధిత పౌరులకు స్వేచ్ఛ, న్యాయం కోసం ప్రపంచం మాట్లాడాలి.' అనే క్యాప్షన్‌ జోడించారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో గ్రెటా థన్‌బర్గ్‌ పోస్ట్‌ వైరల్‌గా మారింది. నెటిజన్లు గ్రెటాకు మద్దతునిస్తున్నారు.