Oct 24,2023 08:02

గాజా : ఇజ్రాయెల్‌ సైన్యం పాలస్తీనియన్లను ఊచకోత కోస్తోంది. ఈ నెల ప్రారంభంలో మొదలైన ఇజ్రాయెల్‌ - హమాస్‌ గ్రూపుల మధ్య దాడుల్లో ఇప్పటికే వేలాది మృతి చెందారు. ఎన్నో ఇళ్లు ధ్వంసమయ్యాయి. మరోవైపు గాజాలో హమాస్‌ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ సైన్యం దాడులకు పాల్పడుతోంది. హమాస్‌ గ్రూపు సమావేశమైన ప్రదేశాలను ఇజ్రాయెల్‌ సైన్యం నాశనం చేస్తోందని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. గడచిన 24 గంటల్లో జరిగిన దాడులపై ఇజ్రాయెల్‌ సైనిక ప్రతినిధి రియర్‌ అడ్మిరల్‌ డేనియల్‌ హగారి మీడియాతో మాట్లాడుతూ.. 'గాజా లోపల హమాస్‌ సైనిక స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సాయుధ, పదాతిదళ బెటాలియన్లు దాడులు నిర్వహించాయి. ఈ దాడులు యుద్ధంలో హమాస్‌ ఉగ్రవాదుల్ని చంపే తదుపరి దశకు తీసుకెళతాయి.' అని ఆయన అన్నారు. ఇక ఈ నేపథ్యంలో అదివారం రాత్రి గాజా స్ట్రిప్‌లో 320కి పైగా హమాస్‌ స్థానిక స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. ప్రధానంగా హమాస్‌ గ్రూపు కమాండ్‌ సెంటర్లు, సైనిక స్థావరాలు, హమాస్‌ గ్రూపు సమావేశమైన ప్రదేశాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. అలాగే ఈ దాడులపై హమాస్‌ గ్రూపు కూడా ఓ ప్రకటనను విడుదల చేసింది. సైనిక స్థావరాలపై దాడులు చేసి, పరికరాలను ధ్వంసం చేసినా.. తాము ధైర్యంగానే ఎదుర్కొన్నామని, పదాతి దళాలను తిప్పికొట్టినట్లు హమాస్‌ వెల్లడించింది.