Nov 04,2023 13:08

విజయనగరం : తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన వందే విశ్వమాతరం పేరుతో ప్రారంభం కానున్న 100 దేశాల సద్భావనా యాత్రకు సంబంధించిన గోడిపతులను విజయనగరం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మీ శనివారం ఉదయం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాషా విశిష్ట సేవాపురస్కార గ్రహీత సముద్రాల గురుప్రసాద్‌ మాట్లాడుతూ ... తెలుగులు వెలుగులు విరజిమ్ముతూ, తెలుగు సాహితీ సౌరభం గుబాళింపచేస్తూ, విశ్వశాంతి, విశ్వమానవ సౌభ్రాతృత్వం, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి రక్షణ, మానవీయ విలువల వంటి బృహత్‌ లక్ష్యాలతో ప్రారంభమైన యాత్ర విజయవంతం కావాలని, తానా ఖ్యాతి మరింత పెరగాలని అభిలషించారు. శత శతకకర్త చిగురుమళ్ల శ్రీనివాస్‌ వందేవిశ్వమాతరమ్‌ పేరుతో వందకు పైగా దేశాలలో శాంతిసద్భావనాయాత్రకు శ్రీకారం చుట్టడం చాలా గొప్ప విషయమని అన్నారు. తానా మరో బృహత్కార్యానికి శ్రీకారం చుట్టిందని, సాహిత్య, సాంస్కృతిక , సామాజిక, చైతన్య ప్రపంచ యాత్ర రెండేళ్లపాటు జరుగుతుందని, 9వ తేదీన ఆఫ్రికా ఖండంలో బోట్స్‌వానా దేశంలో తెలుగు సంఘం అధ్యక్షులు తోటకూర వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రారంభమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షులు శృంగవరపు నిరంజన్‌, తానా పూర్వ అధ్యక్షులు వందే విశ్వమాతరమ్‌ చైర్మన్‌ జయశేఖర్‌ తాళ్లూరి ఆధ్వర్యంలో జరగడం అభినందనీయమని అన్నారు. తానా ప్రతినిధుల కోరిక మేరకు గోడపత్రికను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆవిష్కరణ కార్యక్రమంలో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జీ పాల్గొన్నారు.