న్యూఢిల్లీ : బిఎస్‌పి ఎంపి కున్వార్ దనిష్ అలీపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంపి రమేష్ బిధూరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా మాత్రం మందలింపుతో సరిపెట్టారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని స్పీకర్ సుతిమెత్తగా మందలించారు. పార్లమెంట్‌లో అభ్యంతరకమైన భాషను ఉపయోగించినందుకు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలంటూ బిజెపి ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా గురువారం సాయంత్రం చంద్రయాన్‌ా3పై చర్చ జరిగింది. ఈ చర్చలో రమేష్ బిధూరి మాట్లాడుతున్నప్పుడు బిఎస్‌పి ఎంపి అలీ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. దీంతో బిధూరి తీవ్రమైన మత దూషణలకు పాల్పడ్డారు. పార్లమెంట్ నుంచి బిధూరిని సస్పెండ్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. బిధూరికి వ్యతిరేకంగా స్పీకర్‌కు దనిష్ అలీ స్వయంగా ఫిర్యాదు చేశారు. స్పీకర్‌కు అందజేసిన లేఖలో బిధూరి తనపై ఉపయోగించిన అభ్యంతరకరమైన పదాలను అలీ లిస్ట్ చేశారు. 'ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటన నూతన పార్లమెంటు భవనంలో, స్పీకర్‌గా మీ నాయకత్వంలో జరగడం విచారకరం. ఒక మైనార్టీ సభ్యుడిగా నాకు హృదయ విదారకంగా ఉంది' అని లేఖలో తెలిపారు. బిధూరి వ్యాఖ్యలను లోక్‌సభ ప్రత్యేకాధికారాల కమిటీకి సూచించాలని డిమాండ్ చేశారు. బిజినెస్ రూల్స్ ప్రవర్తనలోని 222, 226, 227 నిబంధనలను గుర్తు చేశారు.
స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో అలీ మాట్లాడారు. 'మనం ప్రజాస్వామ్యానికి తల్లి అని చెప్పుకుంటాము. ప్రజాస్వామ్యంలో ఆలయంగా భావించే పార్లమెంట్‌లో ఒక ఎన్నికైన ఎంపిపై ముల్లా, కత్వా (సున్తీ), ఉగ్రవాదులు వంటి పదాలు ఉపయోగించారు. ఇది నా మనసును ఎంతగానో బాధించింది. రాత్రి నిద్దర కూడా పట్టలేదు' అని తెలిపారు.
బిధూరి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బిధూరి మతపరమైన దూషణలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయడం సరిపోదని, బిధూరిని లోక్‌సభ నుండి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ డిమాండ్ చేశారు. మొహువా మొయిత్రా (టిఎంసి), అసదుద్దీన్ ఒవైసీ (ఎఐఎంఎం) తదితర ప్రతిపక్ష ఎంపీలు కూడా బిధూరిని లోక్‌సభ నుండి సస్పెండ్ చేయాలని కోరారు.