- విదేశాంగ శాఖ మంత్రిగా మాజీ ప్రధాని కెమరాన్
- సునాక్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
లండన్ : అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిళ్లు పెరుగుతుండడంతో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన కేబినెట్ సహచరిణి, హోం మంత్రి సుయెల్లా బ్రేవర్‌మన్‌కు ఎట్టకేలకు ఉద్వాసన పలికారు. పాలస్తీనాకు సంఘీభావంగా లండన్‌లో నిర్వహించిన భారీ ర్యాలీని నిర్దాక్షిణ్యంగా అణచివేయకుండా పోలీసు అధికారులు పక్షపాతంతో వ్యవహరించారంటూ నోరుపారేసుకున్న ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రతిపక్ష పార్టీలతో సహా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరిగింది. మొదట్లో ఆమెను వెనకేసుకొచ్చిన ప్రధాన మంత్రి చివరికి సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు రావడంతో ఉద్వాసన పలకక తప్పలేదు. బ్రేవర్‌మాన్ స్థానంలో ఇప్పటివరకు విదేశాంగ మంత్రిగా వున్న జేమ్స్ క్లెవర్లీని నియమించారు. పార్లమెంటులో ప్రస్తుతం ఏ సభకు ప్రాతినిధ్యం వహించని మాజీ ప్రధాని డేవిడ్ కెమరాన్‌ను సునాక్ తన మంత్రివర్గంలోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. కెమరాన్‌కు కీలకమైన విదేశాంగ శాఖను అప్పగించారు. ఇప్పటికే ప్రజాదరణ అడుగంటిన అధికార కన్సర్వేటివ్ పార్టీని వచ్చే ఎన్నికలకు సిద్ధం చేసే చర్యలో భాగంగానే ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరన చేపట్టారని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. సుయెల్లా బ్రేవర్‌మాన్ మంత్రి పదవి కోల్పోవడం ఇది రెండోసారి. గతేడాది లిజ్ ట్రస్ ప్రధానిగా వున్నప్పుడు కూడా ఆమె హోం మంత్రిగానే పనిచేశారు. ఆ సమయంలో సుయెల్లా వ్యక్తిగత ఈ మెయిల్ నుండి అధికారిక పత్రాలను పంపినట్లు తేలడంతో కోడ్ ఉల్లంఘన కింద ఆమె పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే లిజ్ ట్రస్ తప్పుకోవడంతో రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక, భారతీయ సంతతికి చెందిన బ్రేవర్‌మన్‌ను తిరిగి హోం మంత్రిగా నియమించారు.