Jul 23,2023 09:57

ముంబై : మణిపూర్‌ హింసాకాండపై కేంద్రం, రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వాలపై శివసేన (యుబిటి) అధినేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మణిపూర్‌లో దారుణాలపై 'మణిపూర్‌ ఫైల్స్‌' సినిమా తీయాలన్నారు. కశ్మీర్‌లో కంటే మణిపూర్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగంగా ఊరేగిస్తున్న వీడియోను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోకపోయి ఉంటే, ప్రధాని మోదీ నోరు మెదిపేవారు కాదని శివసేన తమ పార్టీ పత్రిక సామ్నాలో విమర్శించింది. ది కశ్మీర్‌ ఫైల్స్‌, ది కేరళ స్టోరి పేరుతో సినిమాలు తీశారని, ఇప్పుడు వారు మణిపూర్‌ ఫైల్స్‌ పేరుతో సినిమా తీయాలని సూచించింది. మణిపూర్‌లో కనుక బిజెపియేతర ప్రభుత్వం ఉండుంటే ఇప్పుటికి ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసేవారని వ్యాఖ్యానించింది. రాజకీయ పరంగా ప్రధాని మోదీకి మణిపూర్‌తో పెద్దగా ప్రయోజనం లేదని, అందుకే అక్కడి ఘర్షణలను ఆయన పట్టించుకోలేదని ఆరోపించింది.