Jul 30,2023 09:35

చెన్నై : తమిళనాడుకు చెందిన ప్రముఖ విశ్లేషకుడు, పబ్లిషర్‌ భద్రి శేషాద్రిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మణిపూర్‌ మారణకాండపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన నేపథ్యంలో ఆ ఉత్తర్వులను తప్పుబడుతూ శేషాద్రి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌పైనా ఆయన రెచ్చగొట్టే రీతిలో వ్యాఖ్యానించినట్లు తెలిపారు. శేషాద్రిపై 153, 153ఏ, 505(1)(బి) సెక్షన్ల కింద కేసు నమోదుచేసి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన శేషాద్రి..ఒకవేళ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతే, అప్పుడు కోర్టే చూసుకుంటుందని సిజెఐ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. సిజెఐకు గన్‌ ఇచ్చి మణిపూర్‌ పంపిద్దామని, అక్కడ ఆయన శాంతి స్థాపన చేస్తారో లేదో చూద్దామని శేషాద్రి తన ఇంటర్వ్యూలో నోరుజారారు. మణిపూర్‌ అనేది కొండలు ఎక్కువగా ఉండే ప్రాంతమని, క్లిష్టమైన ఆ ప్రాంతంలో హత్యలు కూడా ఎక్కువే జరుగుతుంటాయని కూడా ఆయన పేర్కొనడం గమనార్హం. ఆ హింసను మనం ఆపలేమన్న రీతిలో శేషాద్రి వ్యాఖ్యలు చేశారు. దీనిపై న్యాయవాది కవియరాసు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శేషాద్రిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సుప్రీంకోర్టు సిజెఐ చంద్రచూడ్‌ను విమర్శించడం సరికాదని ఆ ఫిర్యాదులో కవియరాసు పేర్కొన్నారు. శేషాద్రి అరెస్టును బిజెపి రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై ఖండించారు.