మాస్కో : ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా పశ్చిమ దేశాలు నేరుగా రష్యాపై యుద్ధంలోకి అడుగుపెట్టాయని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ పేర్కొన్నారు. శనివారం ఆయన ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ''మీరు దీనిని ఏమైనా అనుకోండి. కాని వారు నేరుగా మాతో పోరాటం చేస్తున్నారు. మనం దీనిని హైబ్రిడ్ యుద్ధతంత్రం అని అనుకోవచ్చు. కానీ, అది పరిస్థితులను మార్చలేదు'' అని అన్నారు. అమెరికన్లు, బ్రిటిషర్లు ఆయుధాలను సరఫరా చేస్తున్న విషయం తెలిసేవుంటుందని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో పశ్చిమ దేశాల కిరాయి మూకలు పాల్గొంటున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. పశ్చిమ దేశాలు తమ ప్రజలను ఉక్రెయిన్ వెళ్లద్దని చెప్పాయి. కానీ, కిరాయి సైనికులు మాత్రం వెళ్లారని వ్యాఖ్యానించారు.
ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో జెలెన్‌స్కీ ప్రసంగంపై కూడా స్పందించారు. తాను ఆకార్యక్రమాన్ని టీవిలో చూశానని, జెలెన్‌స్కీ చాలా భయంకరంగా కనిపించారని అన్నారు. అయితే తాను హాజరుకావాల్సిన కార్యక్రమాలు చాల ఉన్నాయని, జెలెన్‌స్కీ ఏం చెబుతాడో అందరికీ తెలసునని, అందుకే టైమ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకని వినలేదని అన్నారు. జెలెన్‌స్కీ ప్రతిపాదించిన పది అంశాల ప్రణాళిక సహా దానికి మద్దతు ఇచ్చిన అమెరికా, యూరోపియన్ యూనియన్‌ను ఖండించారు. ఇది వాస్తవిక పరిస్థితులకు తగినట్లు లేదని అన్నారు. యుద్ధ క్షేత్రంలోనే ఈ సంక్షోభానికి ముగింపు పలకాలనుకుంటే.. ముగింపు అక్కడే ఉంటుందని సెర్గీ లావ్రోస్ స్పష్టం చేశారు.