- ఐక్యరాజ్య సమితి పనితీరుపై భారత్
న్యూయార్క్ : 21వ శతాబ్దపు భౌగోళిక, రాజకీయ సవాళ్లను ఐక్యరాజ్య సమితి దీటుగా ఎదుర్కొనాలని భారత్ పేర్కొంది. బహుళవాదం ద్వారా పలు దేశాల సమస్యలను పరిష్కరించేందుకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలని కోరింది. తద్వారా ఐక్యరాజ్య సమితి తన నాయకత్వాన్ని పునరుద్ధరించుకోగలుగుతుందని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన చర్చా వేదికగా, విధాన రూపకల్పన, ప్రాతినిధ్య సంస్థగా జనరల్ అసెంబ్లీ తన స్థానాన్ని పునర్వ్యవస్థీకరించుకోవాలని భారత్ ఎప్పుడూ కోరుతూ వస్తోందని ఐక్యరాజ్య సమితిలో భారత్ కౌన్సెలర్ ప్రతీక్ మాథుర్ మంగళవారం పేర్కొన్నారు. 'జనరల్ అసెంబ్లీ కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ'పై జనరల్ అసెంబ్లీ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని దేశాలు సమిష్టి వాణిని వినిపిస్తున్నప్పటికీ జనరల్ అసెంబ్లీ, దాని సభ్య దేశాలు కాలానుగుణ్యతను కోల్పోతున్నాయన్న నింద వుందని, మనం దాన్ని అనుమతించాల్సిందేనని అన్నారు. పైగా, భద్రతా మండలిలో కొన్ని అంశాలపై చర్చ జరుగుతున్న తీరు జనరల్ అసెంబ్లీ పాత్ర, అధికారాలను నొక్కి చెబుతున్నాయని చెప్పారు.