Nov 04,2023 15:16

గాజా :    ఇజ్రాయిల్ అమానవీయ దాడితో గాజాలో పరిస్థితి దయనీయంగా మారింది.  గాజాస్ట్రిప్‌లో ప్రజలు  నీటి కోసం అల్లాడుతున్నారని ఐరాస పేర్కొంది.   'నీరు,  నీరు' అనే పదం  ఆ ప్రాంతమంతా  ప్రతిధ్వనిస్తోందని  తెలిపింది. ఈ ప్రాంతంలో యుఎన్‌ నిల్వ చేసిన పిండితో చేసిన రెండు రొట్టెలతో ప్రజలు కడుపు నింపుకుంటున్నారని పేర్కొంది. ఇటీవల ఈ ప్రాంతంలో పర్యటించినట్లు యుఎన్‌ విభాగంలోని పాలస్తీనా రెఫ్యూజీస్‌ (యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ) గాజా డైరెక్టర్‌ థామస్‌ వైట్‌ పేర్కొన్నారు. ఇటీవల తాను గాజా ప్రాంతంలో పర్యటించానని, గాజా స్ట్రిప్‌ మరణాలు మరియు విధ్వంసంతో నిండిపోయిందని అన్నారు. సురక్షితమైన ప్రదేశం లేదని, పాలస్తీనియన్లు తమ భవిష్యత్తు, కుటుంబాలను పోషించడం గురించి ఆందోళన చెందుతున్నారని అన్నారు. అక్కడి పరిస్థితులను 193 సభ్యదేశాలకు ఆయన వివరించారు.

యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ 1.7 మిలియన్ల పాలస్తీనియన్లకు బ్రెడ్‌ను అందించే లక్ష్యంతో గాజావ్యాప్తంగా సుమారు 89 బేకరీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ.. ఆసాయం సరిపోవడం లేదని, ప్రజలు బ్రెడ్‌, తాగు నీరు కోసం చూస్తున్నారని అన్నారు. ఇజ్రాయిల్‌ నుండి మూడు నీటిసరఫరా పైపులైన్లలో ఒకటి మాత్రమే పనిచేస్తోందని, ఇటీవల దాడిలో రెండు ధ్వంసమయ్యాయని పాలస్తీనా భూభాగంలో మానవతా సాయం కో ఆర్డినేటర్‌ లిన్‌ హాస్టింగ్స్‌ పేర్కొన్నారు. అధికశాతం మంది అక్కడ లభించే ఉప్పు నీరు లేదా భూగర్భ జలాలను వినియోగిస్తున్నారని అన్నారు.
గాజాలోకి ఇంధనాన్ని అనుమతించడంపై ఇజ్రాయిల్‌, ఈజిప్ట్‌, అమెరికా, ఐరాసల మధ్య చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఆస్పత్రులు , ఇతర సంస్థలు పని చేయడానికి, నీరు, విద్యుత్‌ సరఫరాకు, ఇంధనం అత్యవసరమని అన్నారు. ఇంధనాన్ని అనుమతిస్తే ఆస్పత్రులు, నీటిసరఫరా, ఆహార ఉత్పత్తి సదుపాయాలతో పాటు అత్యవసర సేవలు ఒకదాని తర్వాత ఒకటి అందుబాటులోకి వస్తాయని అన్నారు. పారిశుధ్యం కూడా అధ్వాన్నంగా ఉందని చెప్పారు. వంటగ్యాస్‌ కొరత తీవ్రంగా వేధిస్తోందని అన్నారు. యుద్ధం తీవ్రతరం కావడానికి ముందు ప్రైవేట్‌ రంగం ద్వారా ఈజిప్ట్‌ నుండి గాజాకు వంటగ్యాస్‌ను పంపిణీ చేశామని, అయితే ఇప్పుడు అది సాధ్యం కాదని అన్నారు.

యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎకి చెందిన 149 సహాయక శిబిరాలలో సుమారు 60,000 మంది పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నారని, వాటిలో పాఠశాలలు అధికంగా ఉన్నాయని అన్నారు. అయితే ఇజ్రాయిల్‌ వైమానిక, భూతల దాడులతో ఉత్తరాదిలోని చాలా శిబిరాలతో ఏజెన్సీ కమ్యూనికేషన్‌ కోల్పోయిందని అన్నారు. సుమారు 40,000 మంది నిరాశ్రయులు ఇక్కడి పాఠశాలల్లో తలదాచుకున్నారని వెల్లడించారు. ఇజ్రాయిల్‌ ప్రత్యక్ష దాడితో సుమారు 50కి పైగా యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ సహాయక శిబిరాలు ప్రభావితమయ్యాయని చెప్పారు. ఉత్తరాదిలో యుద్ధం కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడుల్లో సుమారు 72 మంది సహాయక సిబ్బంది మరణించారని అన్నారు.

ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ దాడుల్లో సుమారు 9,000 మంది మరణించినట్లు గాజా వైద్య శాఖ తెలిపింది. దీంతో ప్రజల జీవితాలను రక్షించేందుకు కాల్పుల విరమణ ప్రకటించడం అత్యవసరమని యుఎన్‌ పాలస్తీనా రాయబారి రియాద్‌ మన్సూర్‌ పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌ దాడులతో ఇప్పటికే గాజాస్ట్రిప్‌లో 50శాతానికి పైగా నిర్మాణాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. పరిస్థితి వర్ణించనలవికాని విధంగా ఉందని, యుద్ధాన్ని విరమించేలా అన్ని దేశాలు అభ్యర్థించాలని కోరారు.