మాస్కో : హమాస్ రాజకీయ విభాగానికి చెందిన ప్రతినిధులు రష్యా అధికారులతో మాస్కోలో గురువారం భేటీ అయ్యారు. ఈ సమావేశాన్ని రష్యా విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి మారియా జకోర్వా ధ్రువీకరించారు. అయితే ఈ సమావేశానికి సంబంధించిన ఇతర వివరాలను తెలిపేందుకు ఆమె నిరాకరించారు. హమాస్ పొలిటికల్ బ్యూరో ఉపాధ్యక్షుడు ముసా అబు మర్జుక్ ఈ ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహించినట్లు రష్యా మీడియా తెలిపింది.
కిడ్నాప్‌కు గురైన వ్యక్తుల భవిష్యత్తు గురించి చర్చించేందుకు తాను ఖతార్‌లో హమాస్ రాజకీయ ప్రతినిధులతో సమావేశమయ్యానని రష్యా ఉప విదేశాంగ మంత్రి మిఖాయిల్ బోగ్డనోవ్ తెలిపారు. పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ త్వరలో మాస్కోకు వెళ్లి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరుపుతారని ఆయన సూచించారు.
సుమారు 224 మంది ఇజ్రాయిలీస్‌ను హమాస్ గాజాలో బంధించిన సంగతి తెలిసిందే. వీరిలో వేర్వేరు జాతులకు చెందిన ముగ్గురు రష్యన్లు కూడా ఉన్నారని రాయబారి ఆంటోలీ విక్టోరోవ్ తెలిపారు.
ఇజ్రాయిల్, హమాస్‌లు తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని గురువారం విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కోరారు. సుమారు 75 ఏళ్ల క్రితం వాగ్దానం చేయబడిన పాలస్తీనా ఏర్పాటుపై చర్చలను పున:ప్రారంభించాలని రష్యా పిలుపునిస్తోందని పునరుద్ఘాటించారు.