- ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులే గణన చేపట్టాలి
ప్రజాశక్తి- యంత్రాంగం : సమగ్రమైన, కచ్ఛితత్వంతో కూడిన కులగణన అవసరమని కులగణనపై జరిగిన సదస్సుల్లో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. రాష్ట్ర కులగణన-2023 సదస్సులను శుక్రవారం రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో నిర్వహించారు. ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుల్లో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల్‌కృష్ణ, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సదస్సుల్లో వక్తలు తమ అభిప్రాయాలను, అనుమానాలను వ్యక్తం చేశారు. అధికారులు, ప్రభుత్వోద్యోగులే ఈ గణన చేపట్టాలని, వలంటీర్లు పాల్గొనరాదని పలు సూచనలు చేశారు.
రాజమహేంద్రవరంలోని మంజీర హోటల్‌లో శుక్రవారం కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత అధ్యక్షత నిర్వహించారు. ఈ సమావేశానికి కొవ్వూరు ఆర్‌డిఒ మల్లిబాబు వాఖ్యాతగా వ్యవహరించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల రీజియన్ సమావేశంలో ఎంపిక చేసిన 24 మందితో పాటు, మరో ఎనిమిది మంది మొత్తంగా 32 మందికి మాట్లాడే అవకాశం కల్పించారు. తొలుత బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడారు. కులగణనపై ఏడు నెలల పాటు సుదీర్ఘ అధ్యయనం చేసినట్లు తెలిపారు. రాజమహేంద్రవరం ఎంపి భరత్‌రామ్ మాట్లాడుతూ.. పార్లమెంటులోనూ దేశవ్యాప్తంగా కులగణనను ప్రస్తావిస్తామని తెలిపారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కులగణనను స్వాగతిస్తున్నామని, అయితే ఏయే అంశాలు (ఫార్మాట్) సేకరిస్తున్నారో ప్రభుత్వం తెలియజేయలేదన్నారు. పదవులు, విద్యా, ఉద్యోగాల్లో కల్పించిన రాజ్యాంగం ఫలాలు పొందేందుకు సమగ్ర కులగణన అవసరమన్నారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులే ఈ కులగణన చేపట్టాలన్నారు. కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు మాట్లాడుతూ.. కులగణనకు చట్టబద్దత ఉందా..? లేదా అనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలన్నారు. చట్టబద్దత లేని వలంటీర్ల ద్వారా కులగణన సరికాదని తెలిపారు. ప్రభుత్వం చేసేది సర్వేనా? లేక కులగణనా? అనేది స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ సమయంలో మంత్రి వేణు గోపాలకృష్ణ అడ్డుకునే ప్రయత్నం చేశారు. తనను స్వేచ్ఛగా మాట్లాడనివ్వాలని అనడంతో మిగతా 5లో మంత్రి వెనక్కి తగ్గారు. కలెక్టరు కె.మాధవీలత మాట్లాడుతూ.. వక్తలు తమ అభిప్రాయాలను వెల్లడించాలని, కొంత మందికే అవకాశం ఉన్నందున ఇతర సమస్యలపై వినతిపత్రాలు స్వీకరిస్తామని తెలిపారు. మాజీ కార్పొరేటర్ అనసూరి పద్మలత మాట్లాడుతూ.. కులగణన రిపోర్టులను ప్రజలు నేరుగా చూసుకునేలా సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి తీసుకురావాలన్నారు. న్యాయవాది ఐ.శివప్రసాద్ మాట్లాడుతూ.. కులగణన చేసే వారికి సమగ్ర శిక్షణ ఇచ్చిన తర్వాతే ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు మోజెస్ బాబు మాట్లాడుతూ.. ఈ గణనను స్వాగిస్తున్నామని తెలిపారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు అశోక్ కుమార్ మాట్లాడుతూ.. కులగణనతో పాటు ప్రజల ఆర్థిక పరిస్థితులను సేకరించాలని, అగ్రవర్ణాల్లోనూ పేదలు ఉన్నారని తెలిపారు. సూర్యచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. ఈ కులగణనలో కుల పెద్దలను భాగస్వామ్యం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జెసి తేజ్‌భరత్, మున్సిపల్ కమిషనర్ దినేష్‌కుమార్, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం నగరంలోని స్థానిక బృందావన్ ఫంక్షన్ హాల్‌లో ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాలు, కుల సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. తొలుత స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ఈ గణన వల్ల చిన్న కులాలనూ గుర్తించి వారి సమస్యలు, స్థితిగతులు తెలుసుకుని అభివృద్ధి ఫలాలను అందించడానికి దోహదపడుతుం దన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని తరగతులకు చెందిన కులాల వారి సంఖ్యను ఈ నెల 27 నుంచి లెక్కించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. కళింగ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ సంపతిరావు హేమసుందరరాజు మాట్లాడుతూ.. టెక్కలి నియోజకవర్గంలో పలు పంచాయతీల్లో నివాసముంటున్న 'ఏనేటి కొండలు' 15 ఏళ్లుగా ఏ కులానికి చెందక నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి గతంలో వలే ఎస్‌టిలుగా గుర్తించాలని కలెక్టర్‌ను కోరారు. ప్రస్తుతం వారికి ఏ కులం లేకపోవడంతో ధ్రువీకరణ పత్రాలు రాక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
కులగణన చేపట్టే విధానంపై తిరుపతి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో డివిజన్, మండల స్థాయి అధికారులకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. 27 నుంచి డిసెంబర్ 10 వరకు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి కుల గణన చేపట్టాలని తెలిపారు. సర్వే సమయంలో ఆధారాల కోసం ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను అడగరాదని స్పష్టం చేశారు. వ్యక్తి పేరు, వయసు, లింగం, భూమి (వ్యవసాయ, వ్యవసాయేతర), ఇంట్లోని పశువులు, వృత్తి, అన్నిరకాలుగా వచ్చే ఆదాయం, కులం, ఉప కులం, మతం, విద్యార్హత, నివాసం ఉండే ఇళ్లు, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్ వంటి వివరాలు మాత్రమే సేకరించాలని తెలిపారు. అనంతపురం, శ్రీ సత్యసాయి కలెక్టరేట్ల పరిధిలో కులగణన సమావేశాన్ని కలెక్టర్ల అధ్యక్షతన నిర్వహించారు. ఈనెల 27 నుంచి డిసెంబర్ 10 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.