మాస్కో : ఉక్రెయిన్‌కి చెందిన మిలటరీ డ్రోన్ శుక్రవారం సెంట్రల్ మాస్కోలోని ఓ భవనంపై కూలిపోయింది. రష్యా వాయు రక్షణ వ్యవస్థ డ్రోన్‌ను కూల్చివేయడంతో ఈ ఘటన జరిగినట్లు మాస్కో మేయర్ సెర్గీ తెలిపారు. ఇది మానవరహిత వైమానిక వాహనాల తాజా దాడిగా పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున వైమానిక రక్షణ వ్యవస్థ డ్రోన్‌ను కూల్చివేయడంతో... వాటి శిథిలాలు సిటీలోని ఎక్స్‌పో సెంటర్ కాంప్లెక్స్‌పై పడినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఎక్స్‌పో కాంప్లెక్స్‌లో భారీ ఎగ్జిబిషన్స్, సదస్సులు నిర్వహిస్తుంటారని క్రెమ్లిన్ ఓ ప్రకటనలో పేర్కొంది. భవనం ధ్వంసం కాగా, ఆకాశంలో భారీ ఎత్తున పొగకమ్మేసిన దృశ్యాలు స్థానిక మీడియాలో వైరలయ్యాయి.
మాస్కో, సమీప ప్రాంతంలోని భవనాలు లక్ష్యంగా స్థానిక కాలమానం ప్రకారం 4 గంటలకు ఉక్రెయిన్ ఓ మానవరహిత డ్రోన్‌ను ప్రయోగించిందని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అప్రమత్తమైన రష్యా వైమానిక దళం డ్రోన్ లక్ష్యాన్ని మార్చడంతో మాస్కోలోని నివాసేతర భవనంపై కూలిపోయినట్లు పేర్కొంది. అయితే ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని వెల్లడించింది.