Sep 25,2023 11:05

అమెరికాను నిలదీసిన రష్యన్‌ విదేశాంగ మంత్రి లావ్రోవ్‌


ఐక్యరాజ్యసమితి: గొలాన్‌ హైట్స్‌, ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌పై అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదని రష్యన్‌ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ విమర్శించారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శనివారం నాడిక్కడ మీడియా గోష్టిలో మాట్లాడారు. గొలాన్‌ హైట్స్‌ పట్ల ఒకరకమైన వైఖరి, డాన్‌బాస్‌ విషయంలో మరో రకమైన వైఖరి తీసుకోవడం అమెరికా రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని లావ్రోవ్‌ విమర్శించారు. ఐరాసలో అమెరికా రాయబారి లిండా థామస్‌ గ్రీన్‌ఫీల్డ్‌ చేసిన పరస్పర విరుద్ధమైన ప్రకటనల గురించి ఆయన ప్రస్తావిస్తూ, డాన్‌బాస్‌ ప్రాంతం రష్యాకు భద్రత రీత్యా చాలా కీలకమని అన్నారు. ఉక్రెయిన్‌లో జెలెన్‌స్కీ అధికారంలో ఉన్నంతకాలం, ఉక్రెయిన్‌లో నాటో దళాలు తిష్టవేసుక్కూర్చొన్నంత కాలం, రష్యాకు వ్యతిరేకంగా సాయుధ గ్రూపులను నాటో ఎగదోస్తునంత కాలం, రష్యా భద్రతకు ముప్పుగానే దానిని పరిగణిస్తామని అన్నారు. డాన్‌బాస్‌ ప్రాంతంపై తాము ఆచరణాత్మక దృక్పథంతో ముందుకెళ్తున్నామని రష్యన్‌ విదేశాంగ మంత్రి చెప్పారు. ఉక్రెయిన్‌లో పరిస్థితులు మారితే, అప్పుడు పునరాలోచన చేయాల్సి ఉంటుందని, అయితే సమీప భవిష్యత్తులో అటువంటి పరిస్థితి ఏదీ ఉన్నట్టు అనిపించడం లేదన్నారు. రెండున్నరేేళ్లక్రితం అమెరికన్‌ విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ సిఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ పాఠాన్ని లావ్రోవ్‌ ఈ సందర్భంగా మీడియా ముందు చదివి వినిపించారు. బ్లింకెన్‌ ఆ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, 'ఆచరణాత్మక దృష్టితో చూస్తే, గొలాన్‌ హైట్స్‌ ఇజ్రాయిల్‌ భద్రతకు చాలా ముఖ్యం. సిరియాలో అసద్‌ ప్రభుత్వం ఉన్నంతకాలం, సిరియాకు ఇరాన్‌ వత్తాసు పలుకుతున్నంతకాలం, తీవ్రవాద గ్రూపులను సిరియాలోని అసద్‌ ప్రభుత్వం ఎగదోస్తున్నంత కాలం గొలాన్‌ హైట్స్‌ ఇజ్రాయిల్‌ భద్రతకు ముప్పుగానే పరిగణించాల్సి ఉంటుంది. అందుకే ఆ ప్రాంతంపై ఇజ్రాయిల్‌ నియంత్రణ తప్పనిసరి'. అంటూ భారీ డైలాగులు చెప్పారు. దీనిపై లావ్రోవ్‌ స్పందిస్తూ, రష్యా భద్రత ఇజ్రాయిల్‌ భద్రత లాంటిది కాదా అఅని అడిగారు. అదే సమయంలో గొలాన్‌ హైట్స్‌ గురించి ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి లిండా థామస్‌ మాట్లాడుతూ, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాల్సిన అవసరం ఐరాసలో సభ్యత్వం కలిగిన ప్రతి దేశంపైనా ఉందన్నారు. అమెరికా చెప్పే మాటలకు, చేతలకు ఎక్కడా పొంతనే ఉండదని లావ్రోవ్‌ విమర్శించారు. 1967, 1981యుద్ధాల తరువాత ఇజ్రాయిల్‌ ఆక్రమించుకున్న సిరియా భూభాగాలపై ఇజ్రాయిల్‌ సార్వభౌమత్వాన్ని గుర్తిస్తూ 2019లో ఒక డిక్రీపై ట్రంప్‌ సంతకం చేసిన విషయాన్ని లావ్రోవ్‌ గుర్తు చేశారు.