లండన్ : బ్రిటిష్ మాజీ ప్రధాని, కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నిక రేసు నుండి బోరిస్ జాన్సన్ సంచలన ప్రకటన చేశారు. దేశ ప్రయోజనాలు, కన్జర్వేటివ్ పార్టీని ఐక్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. తనకు 100 మందికి పైగా ఎంపీల మద్దతు ఉన్నప్పటికీ తమ పార్టీ ఐక్యత కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్నట్లు భారత సంతతి నేత రిషి సునక్ నిన్న అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం బ్రిటన్ ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్ వైదొలగుతున్న నేపథ్యంలో ఆ పదవికి రిషి సునక్ పోటీ చేస్తూ తుది రేసులో నిలిచినా, చివరకు లిజ్ ట్రస్ చేతిలో రిషి సునక్ ఓడిపోయారు. బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభంతో లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. మరో మారు ప్రధాని ఎన్నిక షురూ అయింది. రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ అందరికంటే ముందున్నారు. తాజాగా, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పోటీ నుంచి వైదొలగుతున్నట్లు ఆదివారం అర్ధరాత్రి తర్వాత ప్రకటించారు. దీంతో రిషి సునాక్‌కు మార్గం సుగమం అయినట్లే.