Nov 08,2022 12:07

షర్మ్‌ ఎల్‌ షేక్‌ :  వాతావరణ సదస్సు -కాప్‌ 27 నుండి బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తన సిబ్బందితో కలిసి అర్థాంతరంగా బయటకు వెళ్లిపోయారు. దీంతో సభకు హాజరైన ప్రతినిధులకు, సభ్యులకు అక్కడ ఏం జరిగిందో అర్థంకాలేదు. కొంత సేపు ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. సదస్సు నుండి ప్రధాని తన సిబ్బందితో బయటకు వెళుతున్న దృశ్యాలు మీడియాలో వైరలయ్యాయి. ''కాప్‌-27 సదస్సులో భాగంగా అడవుల పరిరక్షణ భాగస్వామ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా.. రిషి సునాక్‌ మధ్యలోనే వెళ్లిపోయారు'' అని బ్రిటన్‌కు చెందిన కార్బన్‌ బ్రీఫ్‌ అనే మీడియా వెబ్‌సైట్‌ డైరెక్టర్‌ లియో హికమన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొంటూ.. ఆ వీడియోను షేర్‌ చేశారు. ''వాతావరణ సదస్సులో బ్రిటన్‌ ప్రధాని వేదికపై కూర్చుని ఉండగా.. ఆయన సిబ్బంది ఒకరు వచ్చి సునాక్‌తో ఏదో విషయం చెప్పారు. దాని గురించి వారిద్దరూ కొంద సేపు చర్చించారు. అప్పటికీ రిషి అలాగే కూర్చుని ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత మరో సిబ్బంది వచ్చి రిషిని అక్కడి నుంచి వెళ్లిపోదామని కోరారు'' అని హికమన్‌ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది జరిగిన రెండు నిమిషాలకే రిషి వేదికపై నుంచి దిగి తన సిబ్బందితో కలిసి హడావుడిగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. కాప్‌ 27 అని పిలిచే పర్యావరణ సదస్సు ఈజిప్ట్‌లోని షర్మ్‌ ఎల్‌ షేక్‌ నగరంలో గత ఆదివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

 

;