Nov 13,2023 17:14

లండన్‌  :  యుకె రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.  హోం మంత్రి సుయెల్లా బ్రేవర్‌మాన్‌ను ప్రధాని రిషి సునక్‌ తన కేబినెట్‌ నుండి తొలగించినట్లు సంబంధిత వర్గాలు సోమవారం తెలిపాయి. కేబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరించనున్నట్లు ప్రకటించాయి. శనివారం జరిగిన పాలస్తీనా మద్దతుదారుల మార్చ్‌పై పోలీసులు దాడి చేసిన తీరుపై సుయెల్లా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. మెట్‌ పోలీసులపై సుయెల్లా చేసిన వ్యాఖ్యలపై మొదట్లో ప్రధాని సునక్‌ ఆమెకు అండగా నిలిచారు. ప్రధానికి సుయెల్లాపై పూర్తి విశ్వాసం వుందని 10 డౌన్‌స్ట్రీట్‌ నుండి ఓ ప్రకటన కూడా వెలువడింది. అయితే సొంత పార్టీ కన్జర్వేటివ్‌ సభ్యులతో పాటు ప్రతిపక్ష సభ్యుల నుండి విమర్శలు వెల్లువెత్తడంతో సుయెల్లాను కేబినెట్‌ నుండి వైదొలగాలని రిషిసునక్‌ కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి. బ్రేవర్‌మాన్‌ స్థానంలో విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.

అయితే కేబినెట్‌ పదవి నుంచి సుయెల్లా బ్రేవర్‌మాన్‌ తప్పుకోవడం ఇది రెండోసారి. గతేడాది లిజ్‌ ట్రస్‌ ప్రధానిగా వున్నప్పుడు కూడా ఆమె హోం సెక్రటరీగానే పనిచేశారు. ఆ సమయంలో సుయెల్లా వ్యక్తిగత ఈమెయిల్‌ నుండి అధికారిక పత్రాన్ని పంపినట్లు తేలడంతో కోడ్‌ ఉల్లంఘన కింద ఆమె పదవికి రాజీనామా చేశారు. కొద్దిరోజుల్లోనే లిజ్‌ ట్రస్‌ తప్పుకోవడంతో రిషి సునక్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత సుయెల్లాను తిరిగి హోం మంత్రిగా నియమించారు.