Nov 27,2022 11:57

లండన్‌  :   బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ ఓ కాంస్య శిల్ప కోసం 1.3మిలియన్‌ పౌండ్లు (సుమారు రూ.12 కోట్లకు పైగా) ఖర్చు చేయడం వివాదానికి దారితీసింది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న కరెంటు ఖర్చుల నేపథ్యంలో పొదుపు చర్యలు చేపడుతున్న సమయంలో ఓ విగ్రహం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సన్‌ పత్రిక కథనం ప్రకారం.. ఇటీవల రిషిసునాక్‌ నివసించే 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లోని తన ఇంటి తోటలో ప్రభుత్వ ఖర్చుతో కాంస్య శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ శిల్పి హెన్రీమూర్‌ రూపొందించిన 1980 నాటి 'వర్కింగ్‌ మోడల్‌ ఫర్‌ సీటెడ్‌ ఉమన్‌' అనే ఈ శిల్పాన్ని గత నెల ఓ వేలంలో బ్రిటన్‌ ప్రభుత్వ ఆర్ట్‌ కలెక్షన్‌ కొనుగోలు చేసినట్లు కథనం పేర్కొంది. శిల్పం కోసం పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని రాజకీయ వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.