Aug 04,2023 12:15

న్యూఢిల్లీ  :   రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన బ్రిటన్‌ ఎంపిపై మోడీ ప్రభుత్వం వేధింపులకు దిగింది.  బ్రిటన్‌ ఎంపి తనమ్‌జీత్‌ సింగ్‌ దేశీని రెండు గంటల పాటు అమృత్‌సర్‌ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ''ఇమ్మిగ్రేషన్‌ అధికారులు నన్ను రెండు గంటలపాటు విమానాశ్రయంలోనే నిర్బంధించారు. నన్ను ద్వేషించే వారు నా వీసాను రద్దు చేయాలని ఆదేశించారు '' అని తనమ్‌జీత్‌ సింగ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ''ఈ వేధింపులు ఎందుకో ఊహించండి .. రైతులు, మైనారిటీ సిక్కుల పక్షాన నిలిచినందుకు నేను మూల్యం చెల్లించాల్సి వచ్చింది'' అని ట్వీట్‌లో వెల్లడించారు. ధేశి గురువారం ఉదయం 9 గంటలకు విమానం దిగారని, అయితే ఇమ్మిగ్రేషన్‌ అధికారులు రెండు గంటల పాటు ఆయనను విమానాశ్రయంలోనే ఉంచారని ఓ పోలీస్‌ అధికారి తెలిపారు. అయితే ఎందుకు అడ్డుకున్నారన్నది తనకు తెలియదని అన్నారు. ఇమ్మిగ్రేషన్‌ అధికారులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని చెప్పారు. బ్రిటన్‌ ఎంపి తనమ్‌జీత్‌ సింగ్‌  రైతుల, మైనారిటీ సిక్కుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ పలు ట్వీట్లు చేస్తుంటారు.