- నిలిచిన వందకుపైగా విమానాలు
- దుండగుడి లొంగుబాటు
బెర్లిన్ : జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయంలో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో, ఆ విమానాశ్రయాన్ని అధికారులు ఆదివారం మూసివేశారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించారు. 18 గంటల తరువాత దుండగుడిని అరెస్టు చేసి, అతని నాలుగేళ్ల కుమార్తెను రక్షించారు. జర్మనీలోని న్యూస్‌పోర్టల్ ఎన్‌డిఆర్ తెలిపిన వివరాల ప్రకారం తన కుమార్తెను తీసుకుని 35 ఏళ్ల దుండగుడు ఆదివారం తెల్లవారుజామున 2గంటల సమయంలో కారుతో సెక్యూరిటీ గేట్లను ఢకొీట్టి విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. తుపాకీతో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. వాహనంలో నుంచి రెండు సీసాలకు నిప్పంటించి బయటకు విసిరాడు. తన కుమార్తెను కారులో ఉంచి, ఓ విమానం కింద పార్క్ చేశాడు. ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించడంతోపాటు ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంతోపాటు ఇతర విమానాలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. వందకుపైగా విమానాలను ముందుజాగ్రత్త చర్యగా రద్దు చేశారు. దీంతో, మూడు వేల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తన కుమార్తెను బలవంతంగా లాక్కుని తీసుకెళ్లిపోయాడని దుండగుడి భార్య పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. దుండగుడితోపాటు చిన్నారి ఉండటంతో ఓ సైకాలజిస్టు ద్వారా పోలీసులు చర్చలు జరపగా, నిందితుడు స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.