న్యూఢిల్లీ : ఉజ్వల పథకం కొద్ది మంది వినియోగదారులకు మాత్రమే లబ్థి చేకూరుతోందని తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. ఉజ్వల యోజన పథకంలో భాగంగా 2021-22లో సగానికి పైగా ఎల్‌పిజి లబ్థిదారులు నాలుగు లేదా అంతకంటే తక్కువ సిలిండర్‌లను పొందుతున్నారు. ఈ పథకంలో భాగంగా ఏడాదికి ఆరు లేదా ఏడు సిలిండర్‌లను పొందవచ్చు. కానీ సగానికి పైగా లబ్థి దారులు నాలుగు అంతకన్నా తక్కువ సిలిండర్లు పొందుతున్నారని తేలింది. అయితే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పిఎంయువై) పథకం కింద 96 మిలియన్ల ఎల్‌పిజి సిలిండర్లను అందించామని ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2 నాటికి 95.8 మిలియన్ల కంటే అధికంగా ఉన్నట్లు మీడియా సర్వేలో వెల్లడైంది. అయితే వారిలో 9.6 శాతం మంది లబ్థిదారులు సిలిండర్‌లను తీసుకోలేదని, 11.3 శాతం మంది ఒక్క సిలిండరే తీసుకున్నారని తెలిపింది. గతేడాది 56.5 శాతం మంది నాలుగు సిలిండర్లు లేదా అంతకంటే తక్కువ తీసుకున్నట్లు తేలింది. 2022 ప్రకటన నుండి ప్రభుత్వం ఏడాదికి 12 (14.2 కిలోల సిలిండర్‌కు రూ. 200 ) సిలిండర్‌ల వరకు సబ్సిడీ అందిస్తోంది. అయితే 2021-22లో దేశంలోని 30 కోట్లకు పైగా వినియోగదారులకు 1790 మిలియన్ల సిలిండర్‌లను విక్రయించినట్లు ఆర్‌టిఐ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది. పిఎంయువై లబ్ధిదారులు ఒక వినియోగదారునికి ఏడాదికి సగటున 3.5 సిలిండర్‌లను రీఫిల్ చేయగా, మరోవైపు పిఎంయువై పథకం కిందకు రాని వినియోగదారులకు ఏడాదికి సగటున ఏడుకి పైగా సిలిండర్‌లను అందించినట్లు తెలిపింది.










