
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం శాసనసభలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వంట గ్యాస్ ధరను సిలిండర్‌పై 200రూపాయలు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొంత కాలంగా గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ప్రజానీకం నుండి ఆందోళన వ్యక్తమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. మరోవైపు కర్నాటక ఎన్నికల్లో బిజెపి ఓటమికి గ్యాస్ ధరలు కూడా ఒక కారణం. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా తాజా తగ్గింపు నిర్ణయాన్ని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రకటించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేబినెట్ సమావేశం అనంతరం నేషనల్ మీడియా సెంటర్ (ఎన్‌ఎంసి)లో విలేకరులతో మట్లాడిన మంత్రి ఓనం, రక్షా బంధన్ కానుకుగా గ్యాస్ ధరలను తగ్గించినట్లు తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పిఎంయువై) వినియోగదారులకూ ఈ తగ్గింపు వర్తించనుందని, ప్రస్తుతం ఉన్న సబ్సిడీతో పాటు మొత్తంగా రూ.400 తగ్గింపు లభిస్తుందని అన్నారు. చంద్రయాన్ - 3 విజయం పట్ల ఇస్రోను అభినందిస్తూ మంత్రవర్గ సమావేశం తీర్మానం చేసింది. పెద్ద సంఖ్యలో మహిళా శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం పట్ల హర్షం వ్యక్తం చేసింది.