Oct 12,2023 08:14

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : యువత నైపుణ్యాభివృద్ధి, వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే లక్ష్యంగా 'మేరా యువ భారత్‌ (మై భారత్‌)' పేరిట కొత్త కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. మేరా యువ భారత్‌ (మై భారత్‌) పేరిట ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన వేదిక ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం నేషనల్‌ మీడియా సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. యువత నైపుణ్యాభివృద్ధికి ఒక డిజిటల్‌ వేదికను తీసుకురావడమే మై భారత్‌ ప్రాథమిక లక్ష్యమని తెలిపారు. యువత తమకు కావాల్సిన అవకాశాలను పొందడంతో పాటు సుసంపన్న భారత్‌ నిర్మించడంలో ప్రభుత్వానికి, పౌరులకు మధ్య వారధులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ వేదిక ద్వారా 15-29 మధ్య వయసు ఉన్న వారికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. సర్దార్‌ వల్లభ్‌ భారు పటేల్‌ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 31న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఖనిజాలకు రాయల్టీ రేట్లు నిర్ణయం
బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశంలో కొన్ని ఖనిజాలకు సంబంధించి రాయల్టీ రేట్లను నిర్ణయించారు. లిథియం, నియోబియం ఖనిజాలకు 3 శాతం, అరుదుగా లభించే ఖనిజాలకు (ఆర్‌ఈఈ) 1 శాతం చొప్పున రాయల్టీ విధించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మూడు ఖనిజాలకు దేశంలోనే తొలిసారిగా కేంద్రం వేలం నిర్వహించబోతోంది. ఈ వేలం వల్ల ఖనిజాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తాయి.